హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాన మంత్రి కొవిడ్‌పై నిర్వహించిన కాన్ఫరెన్స్ డ్రామా కాన్ఫరెన్స్‌లా మారిందని దుయ్యబట్టారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలకు పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని సూచించిన విషయం తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సమావేశంలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఓ సమావేశం జరిగింది. సమావేశం ఏదంటే.. ప్రధానమంత్రి వీడియోకాన్ఫరెన్స్ పెడుతరు. ఓ డ్రామా కాన్ఫరెన్స్ ఓటి నడుస్తది. పనేం లేదు.. ఫలితం ఏం లేదు. మూడు గంటలు నాలుగు గంటలు ముఖ్యమంత్రులంతా కూర్చొని ఉండాలే.
వాళ్లంతా చెప్పేది వినాలే. వీటి మీటింగ్ పెట్టింది దేనిమీద. కరోనా మళ్ల వస్తున్నది.. దాని కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలు పెట్టాలని సమావేశం. కానీ సమావేశంలో మాట్లాడేంది ఏంది.. రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గించాలి. కనీసం చెప్పడానికి సిగ్గు ఎగ్గన్న ఉండాలి కదా. ప్రజల మీద భారం వేయవద్దంటే మీరెందుకు పెంచుతున్నరు మోదీ గారు నేడు డైరెక్ట్‌గా అడుగుతున్న. మీ ఏనోరుతోటి రాష్ట్రాలను తగ్గించమంటరు. ఏం నీతి? ఇంత దుర్మార్గమా? ప్రధాని మాట్లాడాల్సిన మాటనేనా? నిజంగా ప్రజలమీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు పెంచినవ్ ? దేనికోసం పెంచుతున్నవ్ ? లేని సెస్సులు ఎందుకు పెంచుతున్నవ్ ? మీ అందరికీ చెబుతున్నా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు.
2015లో అప్పుడున్న ఆర్థిక శాఖ కార్యదర్శి చెబితే ధరలను సరి చేయడానికి రౌండప్ చేయడానికి ఒకసారి సవరించారు తప్పా.. ఈ రోజు వరకు పెట్రోల్, డీజిల్ మీద ఒక పైస కూడా పెంచలేదు. పెంచిన పాపాత్ములు.. పాపాల భైరవులు ఈ బీజేపీలో ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి.. ఆయన మంది మాగదులు. మరి ఏ నోరుతో తెలంగాణను టాక్స్‌లు తగ్గించమంటున్నవ్? తెలంగాణ పెంచలేదు మమ్మల్ని ఎలా తగ్గించమంటవ్? మంత్రి హరీశ్‌రావు చెప్పినట్లు బలమైన కేంద్రం.. బక్క రాష్ట్రాలు.. ఈ కూటనీతి. దీని కోసం దాన్ని గోల్మాల్ చేసి గందరగోళ పరిచి రాష్ట్రాల మీదకు నెట్టేటువంటి కుటిల దుష్ట రాజకీయ ప్రయత్నం. ఇది ఎప్పుడూ దేశ చరిత్రలో చూడలే. పెంచే మేం పెంచుతున్నామని ధైర్యంగా చెప్పాలి. దేనికేం పెంచుతున్నారో చెప్పాలని’ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.