CM KCR | బీజేపీ నాయకులేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే.. కాంగ్రెస్ నాయకులేమో కరెంటు వద్దు రైతుబంధు వద్దు అంటున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కామారెడ్డిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం.. రైతులపై కాంగ్రెస్ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీకి ఎవుసం.. ఎద్దు ఏమైనా తెలుసా? నాగలి పట్టిండా? అని ప్రశ్నించారు. నేను కాపోణ్ని, ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతు బాధ తెలుసని అన్నారు.
‘ ధరణి రాకముందు రైతులకు ఎంతమంది భర్తలు ఉండేటోళ్లు. వీఆర్వో ఒక భర్త. గిరిదవారీ ఒక భర్త. తాసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్, ఆయనమీద రెవెన్యూ సెక్రటరీ.. సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి ఉండేటోళ్లు. ఇండ్ల ఎవరికి కోపం వచ్చినా.. కైలాసం ఆటల పెద్దపాము మింగినట్టే. భూమికి గోవిందా. ఎల్లయ్య భూమి పుల్లయ్యకు రాసి, పుల్లయ్యది మల్లయ్యకు రాసి.. జుట్లు ముడేసి.. వాళ్లకు తాకట్లు పెట్టి. ఆఫీసుల చుట్టు తింపి. వేలు, లక్షలు గుంజిండ్రు. వాళ్లను నాశనం పట్టిచ్చిండ్రు.’ అని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ధరణి పోర్టల్ తెచ్చినమని స్పష్టం చేశారు. ధరణి ద్వారా భూ యాజమాన్యం మార్చేందుకు తన దగ్గర ఉన్న అధికారాన్ని ప్రభుత్వం.. రైతులకే అప్పగించిందని వివరించారు. మీరు బొటనవేలు పెడితేనే భూ యాజమాన్యం మారుతుంది తప్ప.. దాన్ని మార్చే పవర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదని స్పష్టం చేశారు. అలాంటి ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్ల వస్తది? రైతుబీమా ఎట్ల వస్తది? వడ్లు కొన్న పైసలు ఎట్ల వస్తయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ధరణి తీసేస్తే పాత గిరిద్వారీలు.. వీఆర్వోలు వస్తరు. అప్పుడు మల్ల ఆఫీసుల చుట్టుతిరిగే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని అనేటోళ్లను బంగాళాఖాతంలో వేయాలని ప్రజలకు సూచించారు. ఓటేసే ముందు పార్టీల ఫిలాసఫీ ఏంటి? వాళ్ల ఆలోచన సరళి ఏంటనేది ఆలోచన చేయాలని కోరారు.
‘ తెలంగాణ ఉద్యమం అప్పుడు గిట్లనే నన్ను అర్రతిప్పలు పెట్టిండ్రు.. కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాలికి. ఎడ్డం అంటే తెడ్డెం అని.. అవునంటే కాదని.. ఎన్ని రకాల గోసలు పెట్టాలో అన్ని పెట్టిండ్రు. చివరకు నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ శవయాత్రనా? తెలంగాణ జైత్రయాత్రనా అని బయల్దేరితే.. ఎక్కడికక్కడ మీరు నరసింహులై లేస్తే.. ఊర్లన్ని ఉద్యమాలైతే.. సకల జనుల సమ్మె జరిగితే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేసిండ్రు. వెంటనే ఇచ్చిండ్రా అంటే మల్ల ఏడాదిన్నర ఎగవెట్టిండ్రు. సకల జనుల సమ్మె అని యావన్మంది ఉద్యోగులు, ప్రజలు, రైతులు మొత్తం రోడ్ల మీదకు వచ్చి కొట్లాడితే.. చివరకు తెలంగాణల నూకలు పుట్టకుండా అయితయని అప్పుడు ముందుకొచ్చిండ్రు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన తెలంగాణను కూడా బతకనీయొద్దు.. దీన్ని ముందల పడనీయద్దు.. రాజకీయ అస్థిరత తేవాలని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసింది. ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగదుతో పట్టుబడ్డడో.. ఇప్పుడు ఆ మహాత్ముడే కామారెడ్డిల నామీద పోటికొస్తడంట. ఎవరికి ఏం బుద్ధి చెప్పాల్నో మీరే నిర్ణయం చేయాలి.’ అని
ప్రజలను కోరారు.
వచ్చిన తెలంగాణను వచ్చిన్నం చేయడానికి టీఆర్ఎస్ పార్టీని అస్థిరం చేయడానికి వచ్చి ఎవడైతే 50 లక్షల నగదుతో దొరికిండో.. ఆయన్నే తీసుకొచ్చి ఇవాళ కేసీఆర్ మీద పోటికి పెడతరంట. దీనిమీద కామారెడ్డి ప్రజలు తీర్పు చెప్పాలి. ఆ బాధ్యత మీ మీద ఉంది.’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలోచించి.. విచక్షణ చేసి ఎవరి ప్రవర్తన ఏంటనేది చూసి ఓటేయాలని సూచించారు. ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమాగం ఓటేయొద్దని అన్నారు. నేను చెప్పిన నాలుగు మాటలను.. మీరు గ్రామాలకు వెళ్లిన తర్వాత చర్చకు పెట్టాలని సూచించారు. ఇది నిజమా? కాదా? అని చర్చించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయం, వాస్తవం గెలవాలని.. దానికోసమైనా ప్రజలు చర్చకు తేవాలని కోరారు. రైతుబంధు వద్దు.. 24 గంటల కరెంటు వద్దు.. ధరణిని తీసేసి అక్కడ పడేస్తాం అని అనేటోళ్లు కావాల్నా.. ప్రజల్ని కడుపులో పెట్టుకుని చూసేటోళ్లు కావాల్నా? నిర్ణయించుకోవాలని సూచించారు.
ఆనాడు తెలంగాణ వచ్చేనాటికి వలసలు పోవుడు.. బతుకపోవుడు.. చెట్టుకొకలు.. పుట్టకొకలు అయినం. ఆగమాగం అయినం. ఇయ్యాళ కాపాడుకోవాలి? నిలబెట్టుకోవాలని ఐదారు పనులు చేసినం. ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కాల్వలకు నీళ్లు ఇచ్చినం. మన దగ్గర నీళ్లకు ట్యాక్స్ లేదు. రద్దు చేసినం. పాత బకాయిలు ఉంటే మాఫీ చేసినం. ఇయ్యాళ్ల కూడా ప్రాజెక్టుల ద్వారా చెరువుల కింద కానీ రఖం కట్టుడు లేదు. అదేవిధంగా కరెంటు 24 గంటలు ఫ్రీ ఇస్తున్నం. గతంలో రైతులను బాగా బాధపెట్టేది. ఇయ్యాళ ఎవడైనా కరెంటోడు వచ్చి.. నువ్వు ఎన్ని హార్స్ పవర్లు పెట్టినవ్. నీకు రెండు బోర్లు ఉన్నయా? మూడు బోర్లు ఉన్నయా? అని ఎవరైనా అడుగుతున్నరా? వాళ్లను రైతుల దగ్గరకి పోవద్దని.. పోతే కాళ్లు ఇరుగతయి బిడ్డ అని చెప్పినం. కాబట్టి ఎవరు కూడా ఇవాళ రైతులను బాధపెడతలేరు. 24 గంటల కరెంటు వస్తుంది. రైతుకు ఇంత పెట్టుబడి ఉండాలని.. రైతుబంధు స్కీం పెట్టుకున్నం. ఎవరికైనా అపాయం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడొద్దని రైతుబీమా పెట్టుకున్నం. ధాన్యం మీ దగ్గర కొంటే ప్రభుత్వానికి డబ్బులు రావు. ఏటా 500, వెయ్యి కోట్ల నష్టం వస్తది. అయినా సరే అని చెప్పి.. మొత్తం ధాన్యం మీ ఊరికే వచ్చి కొంటున్నం. డబ్బులు కూడా వెంటనే వేస్తున్నం. యాసంగి పంట వరకు ధాన్యం డబ్బులు, రైతుబంధు వస్తున్నాయి. రెండు కలిసి పెట్టుబడికి సరిపోతున్నాయి.అప్పులు తీసుకోవాల్సిన బాధ పోతుంది. ‘ అని సీఎం కేసీఆర్ అన్నారు. రైతాంగాన్ని నిలబెట్టుకోవాలి.. వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే పద్ధతితో ముందుకుపోతున్నమని అన్నారు. ఇలా పెన్షన్లు కావచ్చు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు. గొర్రెల పెంపకం కావచ్చు.. చేపల పిల్లలు కావచ్చు. ఏ వృత్తికి ఆ వృత్తి వాళ్లు పైకి రావాలని అందర్నీ ఆదుకున్నామన్నారు. ‘తెలంగాణ రాకముందు మన గతి ఎట్లుండె. మన చెరువులు ఎట్లుండే. మన చెరువులు మొత్తం బోసిపోయి ఉండె. మిషన్ కాకతీయ ద్వారా చేసుకుంటే.. ఈరోజు బ్రహ్మాండంగా 33వేల కోట్ల రూపాయల చేపలను తెలంగాణ ఎగుమతి చేస్తుంది. ఇలా అన్ని వర్గాలు ప్రజలను కడుపుల పెట్టుకని పోతున్నాం.’ అని తెలిపారు. పదేండ్ల నుంచి శాంతిభద్రతలు ఎట్లున్నయి? ఒక్కరోజు కర్ఫ్యూ లేదు. కల్లోలం లేదు. వానలు బాగపడి కరువు కూడా లేదని అన్నారు. ఓటు వేసే ముందు అభ్యర్థిని చూడాలి.. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని చూడాలి.. ఏ ప్రభుత్వం ఏర్పడితే మంచిదో అది కూడా చూడాలని ప్రజలకు సూచించారు.
కలలో కూడా అనుకోని అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కంటి వెలుగు అనే కార్యక్రమం ఎప్పుడైనా విన్నరా? చరిత్రల ఏ ప్రభుత్వమైనా చేసిందా? అని ప్రశ్నించారు మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి దాదాపు 80 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినం. ఈ పని ఎవరైనా చేసిండ్రా అని నిలదీశారు. ‘ గతంలో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు అడ్డమైనా దోపిడి చేసేది. ఇష్టమైన ఆపరేషన్లు చేసేది. ఇయ్యాళ్ల అమ్మ ఒడి వాహనాలు పెట్టి.. కేసీఆర్ కిట్ పెట్టి బ్రహ్మండంగా ప్రసవాలు అన్ని ప్రభుత్వ దవాఖానాల్ల జరుగుతున్నాయి. మాతా, శిశు మరణాలు తగ్గినయ్.’ అని అన్నారు. వైద్య రంగం కావచ్చు.. విద్య రంగం కావచ్చు. వ్యవసాయ రంగం కావచ్చు.. పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ రంగం పెరుగుతుంది. అని తెలిపారు. కేసీఆర్‌తో పాటు కామారెడ్డికి కూడా పరిశ్రమలు, ఐటీ రంగం కూడా వస్తాయన్నారు. కేసీఆర్ ఒక్కడు రాడు.. కేసీఆర్ వెంబడి చాలా వస్తాయని చెప్పారు. ఇప్పుడు చెబితే నరికినట్టు అయితది.. రేపు అందరికి కనబడ్తదని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని బంగారు తునకలా తయారు చేసి మీకు అప్పగిస్తా అని హామీ ఇచ్చారు.