హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): పచ్చని పంటలు కావాలో.. విద్వేషపు మంటలు కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మౌనంగా ఉంటే దేశంలో, రాష్ట్రంలో మతపిచ్చి మంటలు తప్పవని హెచ్చరించారు. మతపిచ్చి రేగితే అంతులేని విషాదం మిగులుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలంతా అప్రమత్తమై మత కల్లోలాలు సృష్టించే ఈ స్వార్థ, మత పిచ్చిగాళ్లను ఎక్కడికక్కడ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తన కంఠంలో ప్రాణముండగా రాష్ర్టాన్ని ఆగం కానివ్వబోనని, తెలంగాణను కాపాడేందుకు సర్వశక్తులు ధారపోస్తానని తేల్చి చెప్పారు. తన బలం, బలగం ప్రజలేనని, వారి ఆశీర్వాదం ఉన్నంతకాలం తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
పథకాలను కాపాడుకుందామా? పోగొట్టుకుందామా..?
పేదలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు అన్ని వర్గాలకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నాం. ఈ సదుపాయాలు కాపాడుకోవాల్నా? పోడగొట్టుకోవాల్నా? ప్రతి ఒక్కరూ ఆలోచించాలె. నిద్రపోయి ఉంటే పెద్ద ప్రమాదానికి లోనైతం. రాష్ట్రం కోసం పోరాడి, సీఎంగా వాటిని కాపాడాలనే తపనతో చెప్తున్న. మనకు పంటలు పండే తెలంగాణ కావాల్నా? మతపిచ్చితో మంటలు లేచే తెలంగాణ కావాల్నా? అనేది ఆలోచించాలె. పంటలు పండే తెలంగాణ కావాలె. ఇరుకైనా, సంకుచితమైన మత పిచ్చితోటి మంటలు మండే రాష్ట్రమైతే మన భవిష్యత్తు దెబ్బతింటది. గ్రామాల్లో చర్చ పెట్టాలి. పెద్దలతోని, యువతతోని చర్చించాలి. ఇవాళ దేశంలో ఏం జరుగుతున్నది? ఎలాంటి దరిద్రగొట్టు వాతావరణాన్ని చూస్తున్నం. ఎలాంటి అప్రజాస్వామిక విధానాలను చూస్తున్నం. వాటిని సహిద్దామా? పిడికిలి ఎత్తి పోరాడుదామా? రాష్ట్రం బాగున్నా దేశం బాగుండాలె. కేంద్రం కూడా బాగుండాలె. దేశంలో మనం భాగం కాబట్టి, కేంద్రం బాగుపడితే మనం బాగుపడతాం.
ఇలాగే వదిలేస్తే మంటలు రేగుతయి..
బీజేపీ అరాచకాలను ఇలాగే మనం భరించినైట్లెతే, మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించినైట్లెతే, ఇంతే విచ్చలవిడివిగా వాళ్లను విడిచిపెడితే నేను గతంలో చెప్పినట్టు మత పిచ్చి మంటలు చెలరేగుతాయి. మీ బిడ్డగా అందరికీ ఒక మాట చెప్తున్నా.. ఇది నా బాధ్యత కూడా. ఒక ఇల్లు కట్టాలంటే చాలా సమయం పడుతుంది. ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలంటే చాలా సమయం పడుతుంది. ఒక ప్రాజెక్టు కట్టాలంటే చాలాకాలం పడుతుంది. కానీ మూర్ఖంగా, మూఢనమ్మకాలతో, పిచ్చితో, ఉన్మాదంతో కూలగొట్టాలంటే రెండు మూడు రోజులు కూడా పట్టదు. శిథిలమైపోయి, చితికిపోయి, చెట్టుకొకరు, గుట్టకొకరు అయిన తెలంగాణ రైతాంగం ముఖం తెలివిగా చేయడానికి 58 ఏండ్లు కొట్లాడినం. ఎనిమిదేండ్ల నుంచి బొర్లాడుతున్నం. ఎంతో కష్టంచేస్తెగాని తెలంగాణ ప్రజలు, పల్లెలు సల్లవడే పరిస్థితి లేదు.
ఎవరు ఔనన్నా కాదన్నా కర్ణాటక రాజధాని బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. దాదాపు యాభై ఏండ్ల నుంచి అక్కడి ప్రభుత్వాలు కష్టపడి కృషి చేస్తే ఒక మంచి వాతావరణం ఏర్పడింది. తద్వారా సిలికాన్ వ్యాలీగా ఎదిగింది. అక్కడ ఐటీ రంగంలో ప్రత్యక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నయి. రెండోస్థానంలో హైదరాబాద్ ఉన్నది. ఐటీ ఉద్యోగాల కల్పనలో ఎప్పుడూ మనకన్న ముందు బెంగళూరే ఉంటది. ఈ ఏడాది మాత్రం హైదరాబాద్ కంటే.. తక్కువ ఉద్యోగ కల్పన జరిగింది. హైదరాబాద్‌లో 1.50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే. బెంగళూరులో ఏడెనిమిది వేల ఉద్యోగాలు తగ్గిపోయాయి. దీనికి కారణం.. గత ఏడాది నుంచి హిజాబ్, హలాల్ అంటూ మతపిచ్చి రేపి అక్కడి మంచి వాతావరణాన్ని కలుషితం చేశారు.
ఇప్పుడు అక్కడ భయంకరమైన పరిస్థితులున్నాయి. రేపు హైదరాబాద్, తెలంగాణలోనూ మనకు వచ్చే పరిశ్రమలు రాకుండా పోవాలా? ఐటీ రంగం పారిపోవాలా? పిల్లలకు ఉద్యోగాలు దొరకాల్నా వద్దా? ఇవాళ రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ. ఎకరం ధర ఎంతో మీకు తెలుసు. రోడ్డు ఫేస్ ఉన్న రెండెకరాల రైతు కోటీశ్వరుడు. మత పిచ్చిలో పడి ఈ వాతావరణాన్ని చెడగొట్టుకొందామా? కొందరు పనికిమాలినవాళ్లు వారి చిల్లర రాజకీయం కోసం, నీచ రాజకీయ ఎత్తుగడల కోసం మతం మంటలు పెడితే.. రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తే చూస్తూ ఊరుకోవాల్నా? అందరూ ఆలోచించాలి. ఓట్లకోసం, చిల్లర రాజకీయాలకోసం భారత సమాజాన్నే గోస పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నయి.
ఎందుకింత గడబిడ?
బీజీపీ ఎందుకు ఈ గడబిడ చేస్తున్నదో ఆలోచించాలి? ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు ఆగమాగం అవుతున్నరు? ఆయనకు ఏం కావాలి? ఆయనకు ఇప్పుడున్న ప్రధాని పదవి చాలదా? అంతకన్న పెద్ద పదవి ఏమైనా ఉన్నదా? ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా! బీహార్‌లో, ఢిల్లీలో, బెంగాల్లో ఏం జరుగుతున్నది? మన తెలంగాణలో ఎలాంటి కారుకూతలు కూస్తున్నరో ఆలోచన చేయాలి. ఎనిమిదేండ్లుగా మన దగ్గర కఠిన చర్యలు తీసుకోవడంతో చీమ చిటుక్కుమనలేదు. తెలంగాణ సమాజం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతున్నది. మన తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. మంచినీళ్ల సౌకర్యం, కరెంట్ సౌకర్యం వచ్చింది. మంచి కలెక్టరేట్ బిల్డింగులు కట్టుకొంటున్నం. రాష్ర్టాన్ని 33 జిల్లాలుగా చేసుకున్నాం. కానీ ఈ దుర్మార్గులు, ఈ మతపిచ్చి గాళ్లు ఈ రోజు ఎలాంటి దుర్మార్గమైన పద్ధతులు అవలంబిస్తున్నరో దయచేసి ఆలోచన చేయాలి.
నా కంఠంలో ప్రాణముండగా.. రాష్ర్టాన్ని ఆగం కానివ్వను
నేనొక్కటే మాట చెప్తున్నా.. నేను బతికి ఉండగా నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ రాష్ర్టాన్ని ఆగం కానివ్వను. రాష్ర్టాన్ని కాపాడటానికి నా సర్వశక్తులూ ధారపోస్తాను. ఇంకా అభివృద్ధి చేసుకొంటూ ముందుకు పోతూనే ఉంటా. నాకున్న బలం, బలగం మీరే. మీ అండదండలు, అశీర్వచనం ఉన్నంతవరకు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్తాం. బ్రహ్మాండమైన పంటలు పండించుకుందాం. మన ఐక్యత దెబ్బతిన్న రోజు, మత పిచ్చికి మనం లోనైనప్పుడు, మనం చెదిరిపోయిన్నాడు మళ్లీ పాత తెలంగాణ మాదిరి తయారవుతాం. బతుకులు ఆగమైతయి. వీళ్లు ఎక్కడా ఏమీ ఉద్ధరిచ్చింది లేదు. ఊడపొడిచింది లేదు. మీకు దగ్గర్లోనే కర్ణాటక ఉన్నది. ఇక్కడి ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి 500 మంది చొప్పున అక్కడికి తీసుకెళ్లి చూపించాలి.
మన దగ్గర ఉన్నట్టు కర్ణాటకలో ఒక్క స్కీం లేదు. వాళ్లకు చేయడం చేతకాదు. కానీ ఇయ్యాల మనం పచ్చబడితే.. వాళ్ల కండ్లు మండిపోతున్నయి. కుట్రలకు కాలు దువ్వుతున్నరు. ఈ స్వార్థ, నీచ, మత పిచ్చిగాళ్లను ఎక్కడికక్కడ తరిమి కొట్టాలె. మనమంతా అప్రమత్తంగా ఉండాలె. మోసపోతే గోసపడుతం. మేధావులు, రచయితలు, కళాకారులు, విద్యార్థులు, యువకులను కోరుతున్నా.. మతపిచ్చి రేగితే వందేండ్లు తెలంగాణ, భారతదేశం ఆగమైతయి. ఒక్కసారి దెబ్బతింటే, ఉన్న కూర్పు చెడిపోతే, ఒకరకమైన అసూయ, ద్వేషం పెరిగితే సమాజానికి ఏ రకంగానూ మంచిది కాదు.
ప్రేమతో గౌరవంతో, పరస్పర గౌరవాలతో, అనురాగంతో బతికే సమాజం బాగుపడుతది కానీ, పొద్దున లేస్తే కర్ఫ్యూలతో, లాఠీ చార్జీలతో, కోపంతో, అసహ్యంతో ఉండే ఏ సమాజం కూడా పురోగమించిన దాఖలాలు లేవు. అటువంటి దానికి మన రాష్ట్రం బలికావొద్దు. ఆకుపచ్చగా అలరారుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ఇదే విధంగా కొనసాగాలి. స్వచ్ఛమైన మంచినీళ్లు దొరికి, పచ్చని చెట్లు పెరిగి, ఒక అద్భుతమైన శాంతియుత తెలంగాణ కావాలి. ఇందుకోసం మనందరం కూడా నడుంకట్టాలి. బుద్ధిజీవులందరూ ఈ విషయాలు చర్చ చేయాలి. మన రాష్ర్టాన్ని కాపాడుకోవడంలో ముందంజలో ఉండాలి. దేశానికే ఆదర్శంగా ఉండాలి.
ఎనిమిదేండ్లు సరిపోవా?
కృష్ణా జలాల్లో మా వాటా తేల్చండని అడిగితే మన ప్రధానికి చేతకాదు. ఉల్టా పల్టా మాట్లాడుతడు. మా వాటా తేల్చడానికి ఎనిమిదేండ్లు సరిపోవా మోదీగారూ.. ఎందుకు తేల్చరు? ఇవాళ మా రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు నీళ్లు రావాలి. మేడ్చల్ జిల్లాలో కొంతమేరకు వస్తున్నాయి. ఏం.. మేం మనుషులం కాదా? భారతదేశంలో మేం భాగం కాదా? వంద దరఖాస్తులు ఇస్తే, ఈరోజు వరకూ ఉలుకూపలుకూ లేదు. సుప్రీం కోర్టులో కేసు వేశాం. దాన్ని విత్‌డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్‌కు రిఫర్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఎందుకు చేయలేదు? నిష్క్రియాపరత్వంతో కూడుకున్న ఈ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి పారదోలితేనే మనం బాగుపడతాం. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా ఉజ్వల పాత్ర పోషించి, ఈ మత పిచ్చిగాళ్లకు, రక్త పిశాచులకు, ప్రజల మధ్య చీలికలు తెచ్చి, సమాజంలో అసహనాన్ని ప్రేరేపించే వాళ్లకు, అప్రజాస్వామిక పద్ధతుల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టేవాళ్లకు ఈ దేశంలో స్థానం లేదని నిరూపించే మహాయజ్ఞంలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలి. మీ అందరి అనుమతితోనే ఆ పనికి నేనే జెండా ఎత్తుతాను.
స్వరాష్ట్రం వల్లే తెలంగాణ అభివృద్ధి
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటైన తరువాత ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, కల్పిస్తున్న సదుపాయాలు అందరి అనుభవంలో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా అమలుచేయని సంక్షేమ పథకాలు, రైతులను ఆదుకొనే అద్భుతమైన పథకాలు, పీఎంవో మొదలు.. యావత్ ప్రపంచం నుంచి ప్రశంసలు అందుకున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు ఎక్కడా లేవు. తెలంగాణలో 93.5% చిన్నసన్నకారు రైతులే ఉన్నారు. ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా వారం పది రోజుల్లోనే రూ.5లక్షలను వారి ఖాతాలో జమచేస్తున్నం. వేరే చోట్ల రైతులు చాలా బాధలు పడుతున్నరు. అప్పులకు పోతున్నరు.
అంతులేని వడ్డీ భారాన్ని మోస్తున్నరు. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తది. రాష్ట్రవ్యాప్తంగా 7వేల కొనుగోలు కేంద్రాలు పెట్టే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కొనుగోలు తరువాత వారంలోగా డబ్బులు జమ చేస్తున్నం. వెంటనే రెండో పంట సాగు కోసం రైతుబంధు డబ్బులు జమవుతున్నాయి. ఇవాళ తెలంగాణ రైతులు అప్పులు తీసుకొనే అవసరం లేకుంట పంటలు సాగుచేస్తున్నరు. 24 గంటలు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా, నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పాత నీటి తీరువాలు రద్దు చేశాం. ఒక్క రూపాయి వసూలు చేయకుండానే నీళ్లను అందిస్తున్నం. ఇవన్నీ కలగన్నమా? తెలంగాణ ఏర్పడటం, సొంత పరిపాలన రావడం వల్లనే ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి.
మోదీ.. నీళ్లిచ్చే తెలివి లేదా..?
ఏడేండ్ల పాలనలో కేంద్రం ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందా? ఆ చేసిన పని ఏమైనా కనబడుతున్నదా? ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడే నరేంద్ర మోదీ కూడా ప్రధాన మంత్రి అయ్యారు. గొప్ప సిపాయిలు అయితే తెలంగాణలో ఇస్తున్నట్టుగా 24 గంటల విద్యుత్తును దేశం మొత్తం ఎందుకివ్వడం లేదు? ఎందుకు దేశానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు? దీనికి జవాబు ఏమిటి? ఆ భగవంతుడు మన దేశానికి 70 వేల టీఎంసీల నీళ్లు ఇచ్చి నదుల్లో పారుతుంటే కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే తెలివితేటలు లేవా? అలాంటి వాళ్లు వచ్చి మనకు నీతులు చెప్పాలా? వీళ్లే డైలాగులు కొట్టాలా? మనం విని మోసపోవాలా? మనం ఎడ్డి వాళ్లమా, గుడ్డి వాళ్లమా? తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 గంటలపాటు కరెంటు ఉంటది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఉండదు. అక్కడ మంచినీళ్లు కూడా దొరకవు. ఈ ప్రధాన మంత్రేనా మనకు కావాల్సింది?
రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
రంగారెడ్డి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మధ్యాహ్నం 3.20 గంటలకు కొంగరకలాన్‌లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ వద్దకు చేరుకొన్న సీఎంకు జిల్లా నేతలు, అధికారులు ఆహ్వానం పలుకగా, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం 44 ఎకరాల్లో రూ.58 కోట్ల వ్యయంతో నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ అంతా కలియతిరిగి పరిశీలించిన అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ అమోయ్‌కుమార్‌ను ఆయన కుర్చీలో కూర్చోబెట్టి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ చాంబర్లో సర్వమత ప్రార్థనలు జరిగాయి.
కలెక్టరేట్ నిర్మాణంలో భాగస్వాములైనవారిని ముఖ్య మంత్రి కేసీఆర్ సత్కరించారు. కార్యక్రమం లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎస్ వాణీదేవి, నవీన్‌కుమార్, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెగ్గే మల్లేశం, బోగారపు దయానంద్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జైపాల్ యాదవ్, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు అనంద్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం కార్యాలయ ఓఎస్డీ స్మితా సబర్వాల్, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతిరావు, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ బీ మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్‌రెడ్డి, వేద సాయిచంద్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత పీ కార్తీక్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
రూ. 25 కోట్లకు ఓ ఎమ్మెల్యే
ప్రజలు అవకాశం ఇస్తే గెలువాలే. ఆ టర్మ్ మొత్తం ప్రజల కోసం పని చేయాలె. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్షంలోనే ఉండాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది? కేంద్రంలో ఉండే ప్రధానమంత్రే స్వయంగా కుట్రలు పన్నుతూ ఇయ్యాల్టికి తొమ్మిది రాష్ర్టాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొట్టిన్రు. ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులో మూడో వంతు మెజార్టీతో స్టాలిన్ గెలిస్తే, అక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాట్లాడుతున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ గెలిచారు. అక్కడ కూడా ప్రభుత్వాన్ని కూలగొడుతమని మాట్లాడుతున్నరు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో గెలిచిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ రోజు ప్రయత్నిస్తున్నారు. రూ.25 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేను కొంటమని మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు స్వాములుగా ఉన్నారా? ఇది రాజకీయమా? అరాచకత్వమా? దీనికి సమాధానం కావాలి.
ఆదమరిస్తే అంతే..
పురాణమైనా, చరిత్ర అయినా ఏ సమయంలోనైనా కానీ ఎక్కడ ప్రజలు, వారిని చైతన్యవంతులను చేసే విద్యార్థులు, మేధావులు, యువత నిద్రాణమై ఉంటారో, ఏమరుపాటుగా ఉంటారో వాళ్లు చాలా బాధలు అనుభవిస్తరు. అందుకు తెలంగాణ చరిత్రే గొప్ప ఉదాహరణ. ఒకనాడు స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ స్టేట్‌గా మనం ఉన్నం. మనతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు ఉండె. తదనంతరం ఆనాటి మన నాయకత్వం ఏమరుపాటుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మనం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైనం. దానివల్ల పడ్డ బాధలేందో అందరికీ తెలుసు. ఉద్యమం సమయంలో అనేక సభల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, పాటల ద్వారా, తెలంగాణ కవులు సృష్టించిన సాహిత్యం ద్వారా అందరం చైతన్యవంతులు అయ్యాం. ఆంధ్రప్రదేశ్ నుంచి బయటపడటానికి 1969 ఉద్యమంలో 400 మంది పిల్లలు బలయ్యారు. మలిదశ ఉద్యమంలో అనేకమంది చనిపోయారు. అహింసాయుతంగా పోతున్నప్పటికీ అనేక బాధలు పడ్డం. ఒక చిన్న ఏమరుపాటు వల్ల 58 ఏండ్లు తెలంగాణ పోరాడాల్సి వచ్చింది.
దేశంలో ఎక్కడాలేని స్థాయిలో రంగారెడ్డి భూముల ధరలు
తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని కొందరు ప్రచారం చేశారని, ఇప్పుడు దేశంలో ఎక్కడాలేని స్థాయిలో భూముల ధరలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో ఏ శాఖ కార్యాలయం ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉండేదని, అన్ని శాఖలు ఒకే సముదాయంలో అందుబాటులో ఉండేలా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారన్నారు. 15 రోజుల్లోనే వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నూతన కలెక్టరేట్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానమంత్రే స్వయంగా కుట్రలు పన్నుతూ తొమ్మిది రాష్ర్టాల్లో ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూలగొట్టిన్రు. తమిళనాడులో నిన్నగాక మొన్న ఎన్నికైన స్టాలిన్ ప్రభుత్వాన్ని, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కూలగొడుతమని మాట్లాడుతున్నరు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారును కూల్చేందుకు ప్రయత్నిస్తున్నరు. రూ.25 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్యేను కొంటమని మాట్లాడుతున్నరు. ఇది ప్రజాస్వామ్యమా?
-కేసీఆర్