CM KCR | మంచిర్యాల : తలాపునా గోదావరి ఉన్నా.. మంచినీళ్లకు మంచిర్యాల నోచుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, దివాకర్ రావుకు మద్దుతగా ప్రసంగించారు.
ఎన్నికలు రాగానే ఆగమాగం ఓట్లు వేయొద్దు. మంచిగా ఆలోచించి ఓటేయాలి. ఇక ఇప్పుడు కొందరు వచ్చి లేనిలేని కథలు, అబద్దాలు, అభాండాలు, పిచ్చి వాగ్దానాలు నోటికి అడ్డం లేకుండా చెప్తరు. అది దేనికి కూడా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండే వజ్రాయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగం చస్తే మంచిర్యాల భవిష్యత్‌ను, మీ నుదుటి రాతను మంచిగ రాస్తది. లేదంటే ఆగం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతది అని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ రాజ్యంలో పడరాని పాట్లు పడ్డాం. అన్నింటికి బాధలే, కరెంట్ లేదు, సాగునీళ్లు లేవు, మంచినీళ్లు లేవు. సింగరేణిని నిండా ముంచిండ్రు. అన్ని రకాలుగా ఏడిపించారు. ఇదంతా మీరు చూశారు. మీ కండ్ల ముందు జరిగిన చరిత్ర ఇది. రామగుండం పక్కనే ముర్మురులు అనే ఓ గ్రామం ఉండే. అక్కడున్న ఓ కవి ఇలా రాశారు. తలాపునే పారుతుంది గోదారి మన చేను మన చెలక ఎడారి. గోదావరి ఉంటది కానీ చారెడు నీల్లు మన గడ్డమీదకు రావు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. గోదావరి ఒరుకుపోయే ప్రాంతంలో కూడా సరైన మంచినీళ్లు అందించలేదు. అంత గోస పడ్డాం. ఇప్పుడు భగీరథ ద్వారా మంచినీళ్లు అందిస్తున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.