పాలకుర్తి : రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వమే అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్(CM KCR) ఆధ్వర్యంలోనే రైతు రాజ్యం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar ) అన్నారు. పాలకుర్తిలో రైతు సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న(Maize) కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వానికి భారమైనా, రైతుల కోసమే సీఎం కేసీఆర్ ఒకవైపు ధాన్యం, మరోవైపు మక్కలను కొనుగోలు చేస్తున్నారన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు రూ.10వేల పరిహారాన్ని(Compensations) ప్రకటించారని తెలిపారు. చివరకు ధాన్యం తడిపోయి మొలకెత్తుతుంటే, దాన్ని కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించారని తెలిపారు.
మక్కలను కొనుగోలు చేస్తూ మద్దతు ధర ప్రకటించగానే ప్రైవేటు వ్యాపారులు కూడా మక్కలకు రేటు పెంచారని చెప్పారు. ప్రతిపక్షాలు మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలను నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.