CM KCR | సిద్దిపేట : నా చిన్నతనంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఓ ముదిరాజ్ తల్లి నాకు చనుబాలు ఇచ్చి సాదింది అని చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సిద్దిపేట గడ్డతో నాకు ఎంతో అనుబంధం ఉందని కేసీఆర్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
చింతమడకలో నేను చాలా చిన్నగా ఉండే టైమ్‌లో, నేను పసికూనగా ఉండే టైమ్‌లో, అమ్మ చనుబాలు తాగే సమయంలో మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఆ ఊర్లో ఓ ముదిరాజ్ తల్లి నాకు చనుబాలు ఇచ్చి సాదింది. అంత అనుబంధం ఈ గడ్డతో తనకుందని తెలియజేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక ఇక్కడ నేను పాదయాత్ర చేయని గ్రామం లేదు.. నేను తిరగని రోడ్డే లేదు.. నేను చూడని కుంటలు, చెరువులు లేనే లేవు అని కేసీఆర్ తెలిపారు. ఏ ఊరికి పోయినా కూడా ఆ రోజున్న సర్పంచ్‌లందరూ.. అన్న నా మీద కోపం ఉంటే సిద్దిపేటలో తిట్టు కానీ, మా ఊర్ల మందిలా తిట్టకు అని అనేది. అంత బాగా కష్టపడి పనులు చేసి ఒక దరికి తెచ్చాం. కానీ ఆనాడు మంచినీళ్లు లేని సిద్దిపేట. సాగునీళ్లు లేని సిద్దిపేట. బంగారం లాంటి భూములు ఉన్నా పంటలు పండించుకోలేని సిద్దిపేట. కానీ మీ అందరి దయ, ఆశీర్వచనంతో ముందకు సాగాను. ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి, మీ అందరి దగ్గర ఆజ్ఞను తీసుకొని మొండి పట్టులదలతో, మొండి ధైర్యంతో, ప్రాణాలకు తెగించి, ఉద్యమాన్ని ప్రారంభించాను. ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. నాకు బస్సు గుర్తు కేటాయించారు. బస్సు గుర్తు తీసుకొని వస్తే.. సమైక్యవాదులంతా సిద్దిపేటలో అడ్డాపెట్టి, కోట్లకు కోట్లు ఖర్చు పెట్టినా, తిప్పికొట్టి 60 వేల ఓట్లతో భారీ మెజార్టీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం విజయం సాధించడానికి పునాది వేసింది సిద్దిపేట గడ్డనే అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఎక్కడా నేను నిలబడ్డా.. కరీంనగర్, మహబూబ్‌నగర్ ఎంపీగా పోయినా.. గజ్వేల్ ఎమ్మెల్యేగా, రేపు కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టే నేను పోతా అనే విషయం మీకు తెలుసు. ఇంత పెనవేసుకున్న అనుబంధం మనది. బ్రహ్మాండంగా 50 ఏండ్లు కలిసిమెలిసి బతికిన బతుకులు మనవి అని కేసీఆర్ అన్నారు.