హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తన హోదాను రాజకీయ ప్రయోజనాలకోసం వినియోగిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తమిళిసై.. గవర్నర్‌గా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా.. పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు గవర్నర్ రాజకీయ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైగా తమిళిసై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించారు. మహిళలకు ఉన్న ఆత్మాభిమానాన్ని అత్యున్నతంగా గౌరవించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని గుర్తుచేశారు. ప్రొటోకాల్ సరిగాలేదని, తననెవరూ గౌరవించడం టేదని పదే పదే మాట్లాడుతూ.. గవర్నర్ తన స్థాయిని తాను తగ్గించుకొంటున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణకు కేం ద్రం నుంచి రాష్ర్టానికి సంక్రమించిన అన్ని రాజ్యాంగ హక్కులను పొందేవిధంగా తోడ్పాటునందించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలపై ప్రేమే ఉంటే. విభజన చట్టం ప్రకారం కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన హామీలు, నీతి ఆయోగ్ సిఫారసులను సాధించాలని సత్యవతి డిమాండ్‌చేశారు. రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మార్చేందుకు గవర్నర్ ప్రజాదర్బార్ అని, మహిళా దర్బార్ అని రకరకాల పేర్లతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. గవర్నర్ నిర్వహించిన దర్బార్ల ద్వారా ఏం సాధించారని సత్యవతిరాథోడ్ప్రశ్నించారు.
హోదాకు తగ్గట్టు ప్రవర్తించాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
గవర్నర్ తమిళిసై తన హోదాకు తగ్గట్టుగా వ్యహరించాలని, రాజకీయం చేయడం తగదని మంత్రి నిరంజన్‌రెడ్డి హితవుచెప్పారు. సీఎం కేసీఆర్‌పై గవర్నర్ చేసిన వ్యాఖ్యల్ని గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. గత మూడేండ్లలో గవర్నర్‌గా సందర్శించిన ప్రాంతాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. సమస్యలు ఉన్నాయని గవర్నర్ వెళ్లిన ప్రాంతాల్లో ఎన్ని సమస్యలు పరిషరించారని ప్రశ్నించారు. దేశంలో గవర్నర్ పదవికి వార్షికోత్సవం నిర్వహించుకొన్న ఏకైక గవర్నర్ తెలంగాణ గవర్నర్ మాత్రమేనని పేర్కొన్నారు.
గవర్నర్ వ్యవస్థను చెడగొడుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
గవర్నర్ తన స్థాయిని మరిచి ప్రవర్తించవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హితవుచెప్పారు. గురువారంరాయపర్తిలో మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థను చెడగొడుతున్నారని, ప్రజానీకాన్ని బాధపెట్టేలా గవర్నర్ చేష్టలున్నాయన్నారు. గవర్నర్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరించడమే కాక తరచూ ఆ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. గవర్నర్ తన ప్రభుత్వాన్ని తానే కించపరుస్తూ తిరగడమేమిటని విమర్శించారు. మేడారానికి వస్తున్న సందర్భంలో కనీసం స్థానిక మంత్రులకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. గవర్నర్ తన వ్యవహారశైలిని మార్చుకోవాలని సూచించారు.
గవర్నర్ తీరు బాధాకరం:మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ప్రజలు ఎన్నుకొ న్న ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు బాధాకరమని మం త్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయ డం తగదన్నారు. ప్రభుత్వ విధానాలతో గవర్నర్ ఏకీభవించనంత మాత్రాన ప్రశ్నించే అధికారం ఆమెకు లేదన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసన్నారు. గవర్నర్ పదే పదే రాజకీయాలు మాట్లాడుతూ ఓ పార్టీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు.
ప్రభుత్వంపై ఆరోపణలు ఫ్యాషన్‌గా మారింది: జగదీశ్‌రెడ్డి
ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వ ం, ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారిందని విద్యు త్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం సూర్యాపేటలో మాట్లాడుతూ.. నిత్యం వార్తల్లో ఉండేందుకు తమిళిసై ఆరాటపడుతున్నారని విమర్శించారు. రాజ్‌భవన్‌ను ఉపయోగించుకొని బీజేపికి లబ్ధి చేకూర్చేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి పరిణితి చెందిన నాయకుడు మరొకరు లేరని తెలిపారు. మాజీ గవర్నర్ నరసింహన్‌కు రాని ఇబ్బందులు తమిళిసైకి ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
రాజ్‌భవన్‌లో రాజకీయాలు సరికాదు: మంత్రి గంగుల కమలాకర్
గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను మంత్రి గంగుల కమలాకర్ ఖండించారు. స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలని సూచించారు. రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మార్చుకొని ప్రభుత్వంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. రాష్ట్రపతి, ప్రధాని పదవులకు ఎలాంటి సంబంధం ఉంటుందో గవర్నర్, సీఎం పదవులకు అలాంటి బంధమే ఉంటుందన్నారు. రాజకీయాలే చేయాలంటే రాజ్‌భవన్‌లో ఉండి చేయకూడదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి, ప్రజాస్వామ్య వ్యవస్థకే భంగం కలిగే వ్యాఖ్యలు చేయటం ఇకనైనా గవర్నర్ మానుకోవాలని సూచించారు.
సగటు రాజకీయనేతగా మాట్లాడటం బాధాకరం: మంత్రి వేముల
గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పవిత్ర రాజ్‌భవన్‌ను రాజకీయ వేదికగా మారుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. తాను ఇంకా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగానే తమిళిసై వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్షాలలాగే గవర్నర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని తిట్టి మీడియాలో హైలెట్ కావాలనుకొనే సగటు రాజకీయ నేతలా గవర్నర్ ప్రవర్తన ఉన్నదన్నారు.
రాజకీయ వేదికగా మార్చారు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
గవర్నర్ వ్యాఖ్యల పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహించారు. ‘తెలంగాణ ప్రభుత్వా న్ని, సీఎం కేసీఆర్‌ను అపఖ్యాతి పాలుచేయటానికి గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చా రు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంతో ప్రజల మన్ననలను పొందలేరని గ్రహించి.. గవర్నర్ నుంచి ఇలాంటి తప్పుడు ప్రకటనలు వస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.
మీది నామినేటెడ్ పోస్టే:ఎమ్మెల్యే జగ్గారెడ్డి
గవర్నర్ తమిళిసై బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని గురువారం ఒకర ప్రకటనలో విమర్శించారు. గవర్నర్ పదవి నామినేటెడ్ పోస్టు మాత్రమేనని, గవర్నర్ పదవి కన్నా ముఖ్యమంత్రి పదవికే పవర్ ఎక్కువ అని చెప్పారు.