Tata Madhu | సీఎం కేసీఆరే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల పంటల నష్టం జరిగితే దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని సాయాన్ని తెలంగాణలో కేసీఆర్ ప్రకటించారని అన్నారు. ఒకేరోజు నాలుగు జిల్లాల్లో పర్యటించి రైతుపక్షపాతిగా నిలిచారని స్పష్టం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మరిచిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క.. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తుండడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్లో శుక్రవారం తాతా మధు మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆదుకునే విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని అన్నారు. దానిని జీర్ణించుకోలేకే ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం ఒక్క రూపాయి సాయం చేయకున్నా రాష్ట్రం తరఫున వెంటనే సాయాన్ని ప్రకటించి రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ కంటే గొప్ప నాయకుడు మరెవ్వరూ లేరని అన్నారు.
ఖమ్మం జిల్లాలో రైతులకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించడం సంతోషకరమని తాతా మధు అన్నారు. ఇందుకోసం రైతుల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పంటల నష్టంపై సీఎం కేసీఆర్ స్పందించిన తీరును ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. చిల్లర మాటలు మాట్లాడేవారిని ప్రజలు నమ్మరని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల దుస్థితి ఏమిటో దేశ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. వ్యవసాయం చేసే ఏ రైతూ నష్టపోవద్దని ఉద్దేశంతో కౌలు రైతులకు సైతం పరిహారం అందేలా ఆదేశాలు జారీ చేయడం గొప్ప విషయమని అన్నారు.
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ మక్కజొన్న పంటను అత్యధికంగా పండిస్తున్న రైతులు బోనకల్లు మండలంలోనే ఉన్నారన్న విషయాన్ని తెలుసుకునే సీఎం కేసీఆర్.. స్వయంగా ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్నారని అన్నారు. కేసీఆర్ లాంటి సీఎం దేశంలో మరెవ్వరూ లేరని అన్నారు. అకాల వర్షం కురిసి పంటల నేల వాలాక గంటల వ్యవధిలోనే సీఎం క్షేత్రస్థాయికి వెళ్లి వాటిని పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. మీడియా సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య, ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, నాయకులు శ్రీను, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.