CM KCR | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా ప్రదర్శించారు. తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమా హారతి మూడో ర్యాంక్ సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించి, సివిల్స్ కు ఎంపికైన విద్యార్థులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో వారంతా మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించిన ఉమా హారతిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. ఉమా హారతి తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో తనకు గల అనుబంధాన్ని సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. తాను 1996-99 మధ్య నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పని చేసినప్పుడు కామారెడ్డి ఎస్సైగా వెంకటేశ్వర్లు పని చేసేవారన్నారు. ఇప్పుడు నారాయణపేట ఎస్పీగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు.. నక్సల్స్ సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ఉమా హారతి విజయం సాధించినందుకు ఆమె కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.