హైదరాబాద్ : బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం.. దళిత బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు రెండేండ్లలో వెలుగుజిలుగుల భారత్ తయారవుతుందన్నారు. దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అసాధ్యమేమీ కాదు. రూ. 1.45 లక్షల కోట్లతో దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు. బీఆర్ఎస్కు అధికారమిస్తే దేశం మొత్తం దళితబంధు అమలు చేస్తాం. దేశంలో ఏటా 25 లక్షల మందికి చొప్పున దళితబంధు ఇస్తాం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే నిలిపివేస్తాం. మోదీకి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాం.. మీది ప్రైవేటైజేషన్, మాది నేషనలైజేషన్. విశాఖ ఉక్కును మోదీ అమ్మినా.. మళ్లీ బీఆర్ఎస్ తిరిగి తీసుకుంటుంది. పబ్లిక్ సెక్టార్లో పెట్టుకుంటాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
భారతదేశాన్ని ఉజ్వలంగా తయారు చేసే విషయంలో ఏపీ కూడా భాగస్వామి కావాలి. అచ్చమైన అలసు సిసలైన ప్రజా రాజకీయాలు ప్రారంభం కావాలి. గోల్ మాల్ వ్యవహారం నుంచి బయటపడాలి. ప్రజలను కూడా బయటపడేయాలి. అందుకు పుట్టిందే బీఆర్ఎస్. తప్పకుండా విజయం సాధిస్తాం. అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ప్రజలు ఈ రాష్ట్ర పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 6 లక్షల 64 వేల గ్రామాల్లో మన కమిటీలు ఏర్పడాలి. త్వరలోనే కార్యాచరణ ప్రారంభించాం. 4,123 అసెంబ్లీ నియోజవకర్గాల్లో పరుగెడుతాం. ఈ ఆలోచనా సరళి, అన్ని రాష్ట్రాల్లో రగులుకోవాలి. కష్టం తప్పదు. ఏం చేస్తే మంచి సాధిస్తామో దానిపై అధ్యయనం చేయాలి. అలా ముందుకు పురోగమిస్తే 100కు వంద శాతం విజయం సాధిస్తాం. రాజకీయ పని తనం ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి ఉండాలి. కానీ గేమ్ లా ఉండకూడదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.