CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్‌పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కిట్ అంటే నాలుగు సబ్యులు.. మూడు వస్తువులు కాదు అని స్పష్టం చేశారు. వేజ్ లాస్‌ను భర్తీ చేయడమే కేసీఆర్ కిట్ వెనుకాల ఉన్న ఫిలాసఫీ అని కేసీఆర్ వివరించారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ విధానంలో 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
నీతి ఆయోగ్ ఇచ్చే హెల్త్ డిపార్ట్మెంట్ ఇండికేటర్స్‌లో 2014లో మన ర్యాంకు 11 వస్థానంలో ఉండేది. ఇప్పుడు దేశంలో 3వ స్థానానికి ఎదిగాం అని కేసీఆర్ తెలిపారు. పేద ప్రజలు ప్రసూతి సందర్భం వస్తే చాలా బాధలు పడేవారు. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీతో, అనవసరమైన ఆసరేషన్లు చేసేవారు. దీన్ని సమాజం నుంచి ఎలా బయటపడేయాలనే ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక బద్దంగా కేసీఆర్ కిట్ ప్రారంభించుకున్నాం. నిరుపేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా కూలీ పనులు చేస్తుంటారు. అది తల్లి ఆరోగ్యానికి కానీ, శిశువు ఆరోగ్యానికి కానీ మంచిది కాదు. దాన్ని నివారించేందుకు, వారు కూలీకి వెళ్లే డబ్బులను భర్తీ చేసేందుకు మానవీయ కోణంలో తీసుకొచ్చిందే కేసీఆర్ కిట్. కేసీఆర్ కిట్ అంటే నాలుగు సబ్బులు.. మూడు వస్తువులు కాదు. దాని వెనుకాల ఉన్న ఫిలాసఫీ ఏంటంటే.. వేజ్ లాస్‌ను భర్తీ చేయడమే కేసీఆర్ కిట్ వెనుకాల ఉన్న ఫిలాసఫీ. అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణిలను ఆస్పత్రులకు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నాం. డెలివరీ తర్వాత తల్లీబిడ్డలను వారిని ఇంటికి తరలిస్తున్నాం. ఇలాంటి సౌకర్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఈ పథకాల వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలు రక్షించబడ్డారు. కేసీఆర్ కిట్‌తో పాటు న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టాం. న్యూట్రిషన్ కిట్ ద్వారా మంచి పోషాకాహారం అందిస్తున్నాం. ఆరోగ్యకరమైన సమాజం తయారు కావాలన్నదే ప్రధాన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఒక్క జనరేషన్ దెబ్బతిన్న కోలుకోవడానికి 75 సంవత్సరాలు పడుతుంది అని కేసీఆర్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించాలంటే గర్భంలో పెరిగే శిశువుగా బాగుండాలి. అందుకు న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నాం. దీంతో ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి పథకాల ద్వారా ప్రభుత్వ ఆస్పత్రలుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. మాతా,శిశు మరణాలను నివారించాం. 2014లో తల్లులు 92 మంది చనిపోతే ఇవాళ 43కు తగ్గించాం. శిశు మరణాలను 21కి తగ్గించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగేతే.. ఇప్పుడు 76 శాతానికి పెంచాం. పారా మెడికల్ కోర్సులో కూడా ప్రారంభించబోతున్నాం. దేశంలో వైద్య విప్లవం సాధించాం. భవిష్యత్‌లో వైద్య విద్యార్థులకు అండగా ఉంటాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.