CM KCR | ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామని.. పార్టీల చరిత్రను చూసి ఎన్నికల్లో ఓటేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ఆదిలాబాద్ పట్టణం. గ్రామాలు కలిసిన నియోజకవర్గం. చైతన్యం ఎక్కువ ఉండే నియోజకవర్గం. నేను చెప్పే విషయంపై ఆలోచన చేయాలని కోరుతున్నా. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు. ఏ దేశంలో అయితే వచ్చిందో ఆ దేశాలన్నీ ముందుకుపోతున్నయ్. ఎలక్షన్లు చాలాసార్లు వస్తయ్ పోతయ్. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరుండే ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటును జాగ్రత్తగా వినియోగించాలి. ఏమాత్రం కిందిమీద చేసిన గడబిడ అవుతుంది’ అంటూ హెచ్చరించారు.
‘ఓటు సంవత్సరాల తలరాతను మారుస్తుంది. ఎన్నికల్లో అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. దానికంటే ముఖ్యంగా అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల చరిత్ర, వైఖరి, ఎలా ఆలోచిస్తరు ? ఎవరికి మేలు చేస్తరు ? ప్రజలు, రైతుల గురించి ఏం ఆలోచన ఉంటది? ఆ పార్టీల చరిత్రను కూడా చూడాలని కోరుతున్నా. అలా ఆలోచించి ఓటు వేస్తే ప్రజలు గెలుస్తరు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం. బీఆర్ఎస్ చరిత్ర మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ రాష్ట్రం కోసం. చావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమమంతా మీ కండ్ల ముందే జరిగింది. మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నది. తెలంగాణ ఏర్పడిన సమయంలో చాలా సమస్యలున్నయ్. కరెంటు లేదు. నీళ్లు లేవు. వలసలు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండే. వాటన్నింటిపై మధనం చేసి ఆలోచన చేసుకొని ఓ పంథాతో ముందుకెళ్లాం’ అని తెలిపారు.
‘తెలంగాణ వచ్చాక మొదట పేదల సంక్షేమాన్ని చాలా ముఖ్యంగా తీసుకున్నాం. వందల రూపాయలు ఉండే పెన్షన్ను వేల రూపాలకు తీసుకెళ్లాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తీసుకువచ్చాం. ఆ తర్వాత రైతుల గురించి ఆలోచన చేసి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఓ పాలసీ ప్రకారం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. గతంలో నీటి తీరువా వసూలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తీసివేసింది. రైతులు బాగుపడాలని, వ్యవసాయ స్థిరీకరణ తీసుకొని చాలా మంచి పాలసీలు పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే నీటి తీరువా రద్దు చేశాం. 24గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నాం. పెట్టుబడి సమకూరుస్తున్నాం. రైతులు పండించిన పంటలను కొంటున్నాం. అదేవిధంగా రైతుచనిపోతే వాళ్ల ఇంటికి రైతుబీమా వచ్చే విధంగా చేశాం. తెలంగాణ గురించి తెలుసు కాబట్టి.. నేను కూడా ఒక రైతును కాబట్టి.. రైతు బాధ తెలుసుకాబట్టి.. ఎలాగైతే తెలంగాణ వ్యవసాయం లేతస్తో ఆలోచించి నిర్ణయం చేశాం’ అని సీఎం కేసీఆర్ వివరించారు.