హైదరాబాద్ : దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా భారత జాతికి ఆ మహనీయురాలు అందించిన సామాజిక సమానత్వ జ్ఞానాన్ని, చారిత్రక కృషిని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. మహిళల సమాన హక్కుల సాధన కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన కృషి మరువలేనిది అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి సావిత్రిబాయి అందించిన స్ఫూర్తి నేటి తరం కొనసాగించాలన్నారు. దేశ ప్రగతి, సామాజిక అభివృద్ధికి సావిత్రిబాయి ఆలోచనలు ఆచరణయోగ్యమైనవి అని తెలిపారు. నవ సమాజ నిర్మాణానికి ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయం అని సీఎం కేసీఆర్ కొనియాడారు.
కుల, లింగ వివక్షలతో కూడిన విలువలు, మూఢ విశ్వాసాలతో కునారిల్లుతున్న నాటి సమాజాన్ని, సమ సమాజం దిశగా నడిపించేందుకు సావిత్రిబాయి ఫూలే తన జీవితాన్ని ధారపోసిందని సీఎం అన్నారు. ఈ క్రమంలో భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహం మహోన్నతమైనదని, నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల సమాన హక్కుల సాధన కోసం తాను ఎంచుకున్న మార్గంలో ఎన్నో ఛీత్కరింపులు అవమానాలు ఎదురైనా, మొక్కవోని దీక్షతో ప్రతిఘటిస్తూ సావిత్రిబాయి ముందుకు సాగారని, విద్వేషాలకు వ్యతిరేకంగా తన ఆశయాల సాధన కోసం దృఢ చిత్తంతో మహా సంకల్పంతో సావిత్రిబాయి పోరాడారని సీఎం కీర్తించారు. సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, మహిళల సమాన హక్కుల కోసం కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలను సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మహిళా సాధికారతను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు.
సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, మహిళల సమాన హక్కుల కోసం కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలను సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మహిళా సాధికారతను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) January 3, 2023