CM KCR | హైదరాబాద్ : ఇవాళ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థులను స్వీకరించి.. నిండు మనసుతో దీవించాలని తెలంగాణ ప్రజలందరిని కోరుతున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఒక రాష్ట్రం ఎదుగుదలకు, పెరుగుదలకు గీటురాళ్లు కొన్ని ఉంటాయని కేసీఆర్ తెలిపారు. అందులో అన్నింటికి మించి ఎంటైర్ వరల్డ్ ఫాలో అయ్యే ఒక ప్రిన్సిపుల్ ఏందంటే.. పర్ క్యాపిట ఇన్కం ఎంత పెరిగిందని. ఒక లక్షా 20 వేలు ఉన్న పర్ క్యాపిట 3 లక్షల 12 వేల రూపాయాలకు ఇవాళ చేరుకున్నాం. 60, 70 ఏండ్లుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలను తలదన్ని ఈరోజు తెలంగాణ ముందుకు పోయిందంటే చాలా కఠోరమైన క్రమశిక్షణ పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అలా చేశాం కాబట్టే పర్ క్యాపిటలో ముందున్నాం. మరొక గీటురాయి.. పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్. దీన్ని కూడా అభివృద్ధికి కొలమానంగా చూస్తారు. అందులో కూడా ఇండియాలో ఇవాళ నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం. ఆ ఒక్క నంబర్ వన్ పొజిషనే కాదు.. ఇతర వాటిల్లో ఏ రాష్ట్రం కూడా మనకు సాటిరాదు. కారణం ఏందంటే.. 24 గంటల హైపవర్ క్వాలిటీ పవర్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు 24/7 పవర్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. తొమ్మిదేండ్ల కింద ఉన్న కరెంట్ బాధలు జ్ఞాపకం చేసుకుంటే భయమేస్తది. విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది. ఆ రకంగా ముందుకు పురోగమిస్తాం. తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎమ్మెల్యే ఎలక్షన్.. మీరు గెలిపిస్తరు.. ఆశీర్వదిస్తరు. నాకు ఆ విశ్వాసం ఉంది. ఎంపీ ఎన్నికల్లో కూడా తప్పకుండా 17 స్థానాలు గెలువాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు.
ఉజ్వలమైన, అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక రంగం కానీ, ఐటీ విధానం కానీ అన్ని రంగాల్లో హైలీ ప్రొగ్రెసివ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. దానికి ప్రధాన కారణం చోదకశక్తి, బీఆర్ఎస్ పార్టీ. పార్టీ శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు కృషి చేశారు కాబట్టి.. తెలంగాణ ఉన్నత శిఖరాలకు వెళ్లగలిగింది. కొత్త రాష్ట్రమైనప్పటికీ, పసికూన అయినప్పటికీ అనేక రాష్ట్రాలను అధిగమించి, వనరులు తక్కువున్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక డైమండ్లాగా తెలంగాణను తీర్చిదిద్దుకోగలిగాం. భవిష్యత్లో కూడా ప్రజల ఆశీర్వచనం ఉంటే ఇంకా ముందుకు తీసుకుపోతామని మనవి చేస్తూ, ఈ అభ్యర్థులను స్వీకరించి తప్పకుండా వాళ్లకు విజయం చేకూర్చాలని చెప్పి నిండు మనసుతో తెలంగాణ ప్రజలందరిని కోరుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.