హైదరాబాద్ : కామారెడ్డి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున సీఎం కేసీఆర్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రబుత్వం అండగా ఉంటుందన్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్తండా సమీపంలోని హసన్‌పల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే. బంధువులను పరామర్శించి వస్తుండగా ట్రాలీ ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.