మక్తల్, మే 15 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఒక డొల్ల ప్రాజెక్టు అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడంగల్వాసులను మోసం చేయడమే తప్ప ముఖ్యమంత్రికి సాగునీళ్లు ఇచ్చే ఆలోచన లేదని ధ్వజమెత్తారు. ఇక్కడి నీటిని తరలించే ముందు మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు ఏ విధంగా సాగునీళ్లు ఇస్తారో తెలియజేయాలని డిమాండ్‌చేశారు. కొడంగల్‌ను సస్యశ్యామలం చేయాలనుకుంటే సమీపంలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్‌కు నీటిని ఎలా తీసుకెళ్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్యం 1.3 టీఎంసీలు ఉంటే కొడంగల్‌కు 90 కి.మీ. పైపులైన్ ద్వారా ఒక టీఎంసీ ఎలా తీసుకెళ్తారన్నారు. ఈ నిర్మాణానికి మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ టెండర్లు దక్కించుకోగా.. పనులు ప్రారంభంగాక ముందే పైపుల నిర్మాణం చేపట్టామంటూ రూ.100 కోట్ల బిల్లు ఎలా పెట్టారని నిలదీశారు. రైతుల భూములకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.