హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ వర్గీకరణకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ ముఖ్యనేత కొప్పుల రాజు అడ్డుపడుతున్నారని, వారినికాదని వర్గీకరణ చేస్తే తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య విమర్శించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలుచేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. మాదిగలకు రేవంత్ మద్దతిస్తున్నట్టు చెప్తూ తెరవెనక మాలలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రేవంత్ తీరుతో మాదిగ బిడ్డలు ఉద్యోగ నియామకాల్లో నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమ సమయంలో, తెలంగాణ ఏర్పాటుతర్వాత ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్ అండగా నిలిచారని గుర్తుచేశారు. రెండుసార్లు వర్గీకరణకు అనుకూలంగా కేసీఆర్ ప్రభుత్వం తీర్మానం చేసిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేస్తూ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం మోదీని కలిసినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ కుటుంబం వర్గీకరణ ఆపాలని కుట్ర చేస్తున్నట్టు ఆరోపించారు. రేవంత్ మంత్రివర్గంలో మాదిగలకు చోటు ఇవ్వలేదని విమర్శించారు. ఫిబ్రవరి 10లోగా ఎస్సీ వర్గీకరణ అమలుచేయకపోతే బీఆర్ఎస్ తరఫున కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.