జనగామ, మే 26 (నమస్తే తెలంగాణ) : పంటలు ఎండిపోయి అల్లాడుతున్న జనగామ జిల్లా రైతాంగానికి సాగు నీరందించే గండిరామారం దేవాదుల మోటర్ల నిర్వహణకు రూ.6 కోట్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలకు రూ. వందల కోట్లు ఖర్చుపెట్టడం సిగ్గుమాలిన చర్య అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం జనగామలోని క్యాంపు కార్యాలయంలో జనగామ అర్బన్, రూరల్, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన 82 మందికి రూ.2.46 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం తాగు, సాగునీరు, రైతుబంధు, బీమా, పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇచ్చింది.. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో అవన్నీ పోయి.. అందాల పోటీలు ఒకటే వచ్చాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చేదాకా కొట్లాడుతానని స్పష్టం చేశారు. వందల కోట్లు పెట్టి స్పాన్సర్లను తీసుకొచ్చి వాళ్లందరిని ఎలా ఇబ్బంది పెట్టారో పత్రికల్లో చూస్తున్నామని తెలిపారు.