హైదరాబాద్ : పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ( Palamur Project ) పై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీఆర్ఎస్ పాదయాత్ర( BRS Padayatra ) కచ్చితంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud ) స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాలమూరు ప్రాజెక్టుపై పాదయాత్ర అనగానే సీఎం హడావుడి స్టార్ట్ చేశారని, వెంటనే సీఎం రివ్యూ చేసి , ఇరిగేషన్ అధికారులు లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం ఏం లాభమని దుయ్యబట్టారు. రెండున్నరేళ్లలో రివ్యూల మీద రివ్యూలు చేస్తున్న పనులు ముందుకు సాగటం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులను ప్రజలకు చూపిస్తామని వెల్లడించారు.
పాలమూరు,రంగారెడ్డిని పూర్తి చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. నార్లాపూర్,ఏదుల రిజర్వాయర్లు 95 శాతం పూర్తి అయ్యాయి. కాలువలు దాదాపు 98 శాతం బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేశాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత టెండర్లు క్యాన్సల్ చేశారని మండిపడ్డారు. ఏపీలో చీఫ్ సెక్రెటరీగా పని చేసిన ఆదిత్య నాధ్ దాసును సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకున్నారని, ఆయన కారణంగా తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ఏం చేసిందో పాదయాత్ర చేసి చూపించాలని డిమాండ్ చేశారు.పాలమూరు జిల్లాను కాంగ్రెస్ నాశనం చేస్తుందని పేర్కొన్నారు.పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరా ఎండిపోకుండా కేసీఆర్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తే కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల జనవరిలోనే జూరాల ఎండిపోయిందని విమర్శించారు. జూరాల నుంచి నీళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, శ్రీశైలం నుంచి మే నెలలో నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చని సూచించారు. పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లను రీ కాల్ చేయాలని కోరారు. పాదయాత్ర జూన్ లో ఉంటుందని, త్వరలోనే తేదీ ప్రకటిస్తామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు తమ పాదయాత్ర ఉంటుందని వివరించారు.వచ్చే ఆరు నెలల్లో పాలమూరు,రంగారెడ్డిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు అనుమతులకు గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టుతో లింక్ పెట్టడం తెలంగాణ పాలిట ద్రోహమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో టీడీపీ అనుకూల ప్రభుత్వం ఉందని ఏపీ కి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారా ? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ కు ఐదుగురు ఎంపీ లుంటే తెలంగాణకు ఇంత అన్యాయం జరిగేదా ? అని అన్నారు. ఢిల్లీ లో తెలంగాణ అనుకూల గొంతులు లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయ్యాక సాగు నీటికి ప్రాధాన్యత ఇచ్చారని,పాలమూరు,రంగారెడ్డిలో ఐదు రిజర్వాయర్లు పూర్తి చేశామని వెల్లడించారు. రైతుల పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.