హైదరాబాద్, మే 30(నమస్తే తెలంగాణ): తెలుగుజాతి అంతా ఒక్కటేనని ఏపీ సీఎం చంద్రబాబు సెలవిచ్చారు. టీడీపీ పుట్టింది తెలంగాణలోనేనని, ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉన్నదంటూ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీలు, జోనల్ ఇన్చార్జీలు, ముఖ్య నేతలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం తర్వాతే తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని వ్యాఖ్యానించారు. టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు రెండురోజుల కిందట మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే డిక్షనరీలో తెలంగాణ లేదంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు భగ్గుమనటంతో చంద్రబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంతో ఘనమైన చరిత్ర, నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలుగువారు ఎక్కడున్నా తెలుగుజాతి ఒక్కటేనని, ఎవరి మనోభావాలు దెబ్బతీయవద్దని సూచించారు. తెలంగాణ, ఆంధ్రా తనకు రెండు కండ్లు అనే సిద్ధాంతాన్ని జీవితకాలం ప్రవచిస్తూ నాలుగు కోట్ల మంది ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించని చంద్రబాబు.. తెలుగుజాతి ఒక్కటేనని సుద్దులు చెప్పడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తట్టాబుట్ట సర్దుకొని ఏపీకి పారిపోయిన చంద్రబాబు, తనకు అనుకూల సర్కారు తెలంగాణలో అధికారంలోకి రావటంతో తిరిగి ఇక్కడ రాజకీయం చేసేందుకు తహతహలాడుతున్నారని.. అందులో భాగమే ఈ ‘డిక్షనరీ’ వివాదమని ఓ సీనియర్ జర్నలిస్టు విశ్లేషించారు. కేసీఆర్ చెప్పినట్టుగా కత్తి ఆంధ్రోడిది, పొడిచేది మాత్రం తెలంగాణోడే అన్నట్టుగా.. బక్కని నర్సింహులుతో వ్యూహాత్మకంగా వివాదాన్ని రాజేసి తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత రాగానే తనకు రెం డు ప్రాంతాలు సమానమని చెప్పటం ద్వారా తనపై ఉన్న తెలంగాణ వ్యతిరేక ముద్రను చెరిపేసుకొనేందుకు మహానాడును వేదికగా ఉపయోగించుకొన్నారని ఓ రాజకీయ నాయకుడు విశ్లేషించారు.
తెలుగుజాతి ఒక్కటే అయితే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ లేఖలు ఎందుకు రాసినట్టు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేసిన రేవంత్ ఇటీవల మాట్లాడుతూ ఇందిరాగాంధీ, ఎన్టీఆర్తో స్ఫూర్తితో ముందుకుసాగుతామని, ఇద్దరూ తమకు ముఖ్యమేనని ప్రకటించారు. దీంతో చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ కూడబలుక్కొని తెలంగాణలో మళ్లీ టీడీపీకి ప్రాణం పోయాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇరువురి వ్యాఖ్యలు సైతం అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. తెలుగుమాట్లాడే ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ పుట్టిందే టీడీపీ. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్వయంగా రేవంత్రెడ్డి ఆవిష్కరించటంతో ఇద్దరి మధ్య ఉన్న అవగాహన స్పష్టమైందని తెలంగాణవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.