హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురసరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకుగానూ టీజీ జెన్కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీ ప్రతాప్‌ను ప్రతిష్టాత్మక ‘తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకానికి’ ఎంపిక చేసింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖాగోయల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో ప్రతాప్ చూపిన అద్భుతమైన ప్రతిభ, అంకితభావానికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.
పతకంతోపాటు ఆయనకు రూ.5 లక్షల నగదు బహుమతి కూడా మంజూరు చేసింది. తెలంగాణ డీజీపీ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు సేవా పతకానికి ఎంపికైన ఏఎస్పీ ప్రతాప్‌ను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. ఆయనతోపాటు పోలీసు పతకాలకు ఎంపికైన 694 మంది అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
తమ శాఖల్లో విశిష్ట సేవలందించిన పోలీసులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ, ఎస్పీఎఫ్, ఫైర్ సిబ్బంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. ఈసారి మొత్తం 6 విభాగాల్లో పతకాలను అందజేస్తున్నారు. ఇందులో అత్యంత సాహసోపేతమైన సేవలు అందించిన 12 మందికి తెలంగాణ శౌర్య పతకం దకగా, వారికి నెలకు రూ. 500 చొప్పున రికరింగ్ అలవెన్స్‌తో పాటు ఏకమొత్తంగా రూ.10,000 నగదు పురసారాన్ని అందజేయనున్నారు. అలాగే 19 మంది తెలంగాణ మహోన్నత సేవాపతకం (రూ. 40,000), 109 మంది తెలంగాణ ఉత్తమ సేవా పతకం (రూ. 30,000), విభిన్నమైన విధుల్లో అంకితభావం ప్రదర్శించిన 50 మంది సిబ్బంది తెలంగాణ కఠిన సేవా పతకం (రూ. 20,000), సుదీర్ఘకాలం ఉత్తమ సేవలు అందించిన 503 మంది తెలంగాణ సేవా పతకానికి(రూ. 20,000) ఎంపికయ్యారు. పోలీస్ విభాగం నుంచి 632 మందికి, ఫైర్ విభాగం నుంచి 20 మందికి, ఏసీబీ నుంచి 13 మందికి, ఎస్పీఎఫ్ నుంచి 18 మందికి, విజిలెన్స్ నుంచి 11 మందికి సేవా పతకాలు దక్కాయి.
