Bhatti Vikramarka | కమలాపూర్, ఏప్రిల్ 23: కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ మతోన్మాద బీజేపీలో ఎందుకు చేరినవో ప్రజలకు చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూటిగా ప్రశ్నించారు. ఎప్పుడో ఆరు నెలల క్రితం ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను భట్టి తీవ్రంగా ఖండించారు. ఆదివారం పీపుల్స్ మార్చ్ కమలాపూర్ మండలంలోని భీంపల్లికి చేరింది.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతిశీల భావాలున్న వ్యక్తినని ప్రచారం చేసుకున్న ఈటల రాజేందర్.. వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దోపిడీ చేయకుంటే.. వేల కోట్లకు ఎలా ఎదిగావని నిలదీశారు. ఈటలదే దోచుకునే మనస్తత్వం అని ధ్వజమెత్తారు. ఈటల కార్పొరేట్ల పార్టీ బీజేపీలో చేరి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు నీతి నిజాయితీగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈటల మాదిరిగా దోచుకునే బుద్ధి ఉంటే.. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్లు సంపాదించుకునేదని వివరించారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం పచ్చి మోసమని పేర్కొన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టారాజ్యంగా పెంచిన బీజేపీ.. పేద, మధ్య తరగతి ప్రజలకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను దెబ్బతీసేందుకు, ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఈటల నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, నియోజకవర్గ ఇన్చార్జి బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.