హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తేతెలంగాణ): వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్టు వాతావరణ, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల గాలి, నీరు, ఆహార కాలుష్యం పెరుగుతున్నదని, దీంతో ఎలర్జీలతోపాటు గుండె, శ్వాస నాళాలు, కీళ్ల వ్యాధులు పెరుగుతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది.
ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బతోపాటు మూత్రపిండ వ్యాధులకు, రక్తపోటులో మార్పులకు దారితీస్తున్నదని, దీంతో గుండెపోటు, పక్షవాతం లాంటి జబ్బుల ముప్పు పెరుగుతున్నదని ‘క్లెమేట్ చేంజ్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్’ అధ్యయనం తేల్చింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల గర్భిణుల్లో వాతం, గర్భస్రావం, నెలలు నిండక ముందే ప్రసవించడం లాంటి సమస్యలు తలెత్తుతున్నట్టు నిపుణులు తెలిపారు.
ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, చలిగాలుల వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని వివరించారు. శీతాకాలంలో చలి అంతగా లేకపోతే దోమలు వృద్ధి చెందుతాయని, ఫలితంగా డెంగీ, మలేరియా లాంటి వ్యాధు లు విజృంభిస్తాయని పేర్కొన్నారు. నీటి కాలుష్యం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల్లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకంగానూ పరిణమిస్తున్నాయని తెలిపారు.