Mahabubabad | తొర్రూరు మార్చి 5: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులపాలిట కొట్లాటకు దారితీస్తున్నది. సాగునీటి సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నా కొద్దీ రైతుల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. పొలాలకు నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సాగునీటి సమస్యను పరిషరించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతుల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం జీకే తండా, పెద్దవంగర మండలం బాలాజీతండాల మధ్య సాగునీటి కోసం రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది.
మైలారం ఎస్సారెస్పీ ఫేస్-2 రిజర్వాయర్ నుంచి కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా డీపీఎం-57 కాలువకు నీరు రావాల్సి ఉన్నది. ఈ నీరు అమ్మాపురం జీకే తండా రైతులకు చేరడం లేదనే కారణంగా సమస్య తీవ్రతరమైంది. నీటి సరఫరా విషయం తెలుసుకోవడానికి వెళ్లిన రైతులు బానోతు మంగ్య, అజ్మీరా రమేశ్, గుగులోతు భిక్షంపై బాలాజీ తండా వాసులు దాడి చేశారు. డీపీఎం-57 కెనాల్ గేటును మూసివేయడం, నీరందక పోవడం వల్ల ఆగ్రహంతో ఉన్న రైతు మంగ్యాపై కర్రలతో దాడి చేయడంతోపాటు, రమేశ్‌ను నీటిలో ముంచి హింసించారు. వీరిని కాపాడేందుకు వచ్చిన భిక్షం కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నీళ్ల కోసం ఎదురు చూస్తున్నం
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఊరికి నీళ్లొచ్చాయి. మేము సంతోషించేలోగా కొందరు వ్యక్తులు వచ్చి గేట్లు బంద్ చేశారు. ఎందుకు చేస్తున్నారంటే అడిగితే మా మీదే దాడిచేశారు. ఈ గొడవ కొందరు నాయకుల ముందే జరిగింది. కానీ వాళ్లు స్పందించడమే లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేలొనాలి. మా పంటలు ఎండిపోతున్నయి. రైతును పట్టించుకోని పాలన ఉంటేం, లేకుంటేం.
-బానోత్ మంగ్య, రైతు, జీకే తండా