Mahalakshmi | మక్తల్, అక్టోబర్ 7: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల మధ్య కొట్లాటలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రం నుంచి గద్వాల వెళ్లే బస్సు సోమవారం ఉదయం 8:15 గంటలకు మక్తల్ బస్టాండ్‌కు వచ్చింది.
ఈ సమయంలో మహిళలు తోసుకుంటూ బస్సెక్కారు. సీటు విషయంలో ఇద్దరి మధ్య మొదలైన గొడవలో సిగపట్లు పట్టుకున్నారు. తోటి ప్రయాణికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు వచ్చి మొత్తం ఏడుగురిని పీఎస్‌కు తరలించారు. ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డిని వివరణ కోరగా.. ప్రయాణికుల గొడవ తమ దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు.