మెదక్, జూన్ 15 (నమస్తే తెలంగాణ)/మెదక్ అర్బన్: మెదక్ పట్టణంలో శనివారం రాత్రి 7 గం టలకు రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. గోవధను నిషేధించాలని ఓ వర్గం వారు శనివారం మధ్యాహ్నం పట్టణంలో ఆందోళనకు దిగారు. బంగ్లా చెరువు వద్ద గోవులు కనిపించడంతో ఓ వర్గం వారి కోసం వధించేందుకు తెచ్చారని మరో వర్గం వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బంగ్లా చెరువు వద్ద గోవులను కస్టడీలోకి తీసుకున్నారు. నర్సిఖేడ్లో ఇంకొన్ని ఆవులున్నాయ ని పోలీసులకు తెలుపడంతో సీఐ అక్కడికి వెళ్తుం డగా, ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరోవర్గం యువకుడిపై కత్తితో దాడిచేశాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ దవాఖాన అద్దాలు, డాక్టర్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జితో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దుకాణాలను మూసి వేయించిన పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.