హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్ సూట్లను విచారించే అధికారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో)కి లేదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏజెన్సీ చట్ట నిబంధనల ప్రకారం సివిల్ సూట్లపై విచారణ జరిపే అధికారం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్నదని, ఆ అధికారాన్ని ప్రభుత్వ అదనపు ఏజెంట్లుగా పీవోలకు కట్టబెట్టడం చెల్లదని స్పష్టం చేసింది. 2002లో ఉట్నూరు ఐటీడీఏ పీవోకు సివిల్ సూట్లను విచారించే అధికారాన్ని అప్పగిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఐటీడీఏ పీవోల వద్ద పెండింగ్లో ఉన్న అన్ని సివిల్ సూట్లను కలెక్టర్లకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఒక సివిల్ వివాదంలో డాక్యుమెంట్లను పరిశీలించేందుకు చేతిరాత నిపుణులకు పంపాలన్న అభ్యర్ధనను తిరసరిస్తూ ఉట్నూరు ఐటీడీఏ పీవో ఉత్తర్వులు జారీచేయడంపై హస్నాపూర్ గ్రామానికి చెందిన చవన్ ప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ కే శరత్ శుక్రవారం ఈ తీర్పును వెలువరించారు.