హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఒక కంపెనీకి జరిగిన భూకేటాయింపుల రద్దుకు ప్రభుత్వం ఏకంగా ఒక చట్టం తేవడం అన్యాయమని ఐఎంజీ భరత్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో వాదించింది. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం 2003లో అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సర్కార్ రద్దు చేయడాన్ని సవాల్ చేసింది.
హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన భూములను, స్టేడియాలను నామమాత్రపు ధరకు ఒకే సంస్థకు అప్పగించడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పలు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.