హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): స్థిరాస్తిపై హకుల గురించి సంవత్సరాల తరబడి పట్టించుకోకుండా తీరుబడిగా కొత్త కారణాలతో పూర్వీకుల ఆస్తిపై హకులు ఉన్నాయంటూ దావా వేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హకులు మొదటిసారి ఇతరులకు బదలాయింపు జరిగినప్పటి నుంచే దావా వేసేందుకు గడువు మొదలవుతుందని గుర్తుచేసింది. హకులు ప్రారంభమైన 12 ఏండ్లలోపు ఆస్తులను క్లెయిం చేస్తూ సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. 1967 నాటి ఆస్తి వివాదంలో గతంలోని లావాదేవీల పత్రాల గురించి ప్రస్తావించకుండా 2020 నాటి లావాదేవీల ఆధారంగా ప్రైవేటు వ్యక్తులు హకులు కోరడం చెల్లదని తేల్చి చెప్పింది.
దావా దాఖలుకు గడువు వ్యవహారంలో లిమిటేషన్ చట్టానికి వ్యతిరేకంగా సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 29 ఎకరాల భూమిపై హకులు కోరుతూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన దావాను సివిల్ కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ 22వ సెంచురీ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వేసిన పిటిషన్పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ఉత్తర్యులు జారీచేశారు. 1967 నుంచి భూమికి సంబంధించి లావాదేవీలు జరుగుతున్నాయని, వాటన్నింటినీ ప్రస్తావించకుండా 2020 నాటి లావాదేవీల ఆధారంగా హకులు కోరడాన్ని తప్పుపట్టారు. లిమిటేషన్ చట్టానికి వ్యతిరేకంగా సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు చెప్పారు.