TGCHE | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల సిలబస్‌ను సమగ్రంగా మార్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్ట్స్ కోర్సుల్లో 30%, సైన్స్ కోర్సుల్లో 20% సిలబస్‌ను మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇలా ఏటా 20 నుంచి 30 శాతం చొప్పున సిలబస్‌ను మార్చుకుంటూ వెళ్తారు. ముఖ్యంగా ఆర్ట్స్ కోర్సుల సిలబస్‌ను పోటీపరీక్షలకు అనుగుణంగా మార్చుతారు. సివిల్స్, గ్రూప్స్ లాంటి పోటీపరీక్షలకు అనుసరిస్తున్న సిలబస్‌ను డిగ్రీ ఆర్ట్స్ కోర్సుల్లో అంతర్భాగం చేస్తారు. ఇంజినీరింగ్‌లో 50% ఇంటర్న్‌షిప్‌ను అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీంతో 50% థియరీ క్లాసులు, మరో 50% ఇంటర్న్‌షిప్‌లు అమలవుతాయి. డిగ్రీ విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలను (ఫీల్డ్వర్క్స్), ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించడాన్ని తప్పనిసరి చేస్తారు. వీలైనంత త్వరగా కొత్త సిలబస్‌ను సిద్ధంచేసి వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నత విద్యామండలి అధికారులు పనిచేస్తున్నారు. ఈ నెలలోనే వర్సిటీల వీసీలు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాలను నిర్వహించడం ద్వారా సిలబస్‌ను ఆమోదించి, అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కొన్ని ముఖ్యమైన మార్పులు ఇవీ..
ప్రతి మూడేండ్లకోసారి సిలబస్ మారుస్తాం
విద్యావ్యవస్థలో మార్పులు చేయాలంటే సిలబస్‌లో మార్పులు చేయాలి. ఉత్తమ సిలబస్‌తోనే ఉత్తమ విద్యను అందించగలం. అప్పుడే ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందించగలం. గతంలో మన దగ్గర సిలబస్‌ను మార్చే ప్రయత్నాలు జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఇకపై ప్రతి మూడేండ్లకోసారి సిలబస్‌ను మార్చనున్నాం. జాబ్ ఓరియంటెడ్, ఎంటర్పెన్యూర్షిప్ను అభివృద్ధి చేసేలా కొత్త సిలబస్‌ను రూపొందిస్తున్నాం. వర్తమాన పరిస్థితులతోపాటు పారి శ్రామిక రంగం ఆశిస్తున్న నైపుణ్యాలకు అనుగుణంగా సిలబస్ రూపకల్పన చేస్తున్నాం.
– ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్