హనుమకొండ, అక్టోబర్ 11: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోలులో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్‌రాజు తెలిపారు. అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కుట్ర చేసి, నకిలీ రైతులను సృష్టించి ప్రభుత్వ నిధులను పకదారి పట్టించారని తెలిపారు. శనివారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్లో ఓఎస్డీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ సైదులుతో కలిసి శశిధర్‌రాజు మీడియాతో మాట్లాడారు. 2024-25 రబీ సీజనల్ శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు తమ విచారణలో తేలిందని అన్నారు. కమాలాపుర్ సాంబశివ మినీ మోడ్రన్ రైస్‌మిల్లు యజమాని శ్రీనివాస్ ఈ అవినీతికి సూత్రధారుడని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ అధికారులతో శ్రీనివాస్ కుమ్మక్కై అధికారిక ఆన్లైన్ ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ (ఓపీఎంఎస్) పోర్టల్ ద్వారా 12 మంది నకిలీ రైతుల (తన కుటుంబ సభ్యులు, బంధువులు) వివరాలను నమోదు చేసి అవినీతికి పాల్పడ్డాడని వివరించారు.
నకిలీ రైతుల పేరుతో 278 ఎకరాలు సాగు చేసినట్టు చూపి రూ.1,84,63,088 విలువ చేసే 8,049.6 క్వింటాళ్ల ధాన్యం సేకరించి, రవాణా చేసినట్టు రికార్డుల్లో చూపి శ్రీనివాస్ అవినీతికి పాల్పడినట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని 12 మంది నకిలీ రైతుల ఖాతాలకు బదిలీ చేశారన్నారు. అక్రమంగా ైక్లెయిమ్ చేసిన రూ.1.86 కోట్లకుపైగా నిధులు, రవాణా చార్జీలను తక్షణమే రికవరీ చేయాలని, తదుపరి బోనస్ చెల్లింపులు చేయరాదని సివిల్ సప్లయి కార్పొరేష్‌కు సూచనలు చేసినట్టు తెలిపారు. రైస్ మిల్లర్, వ్యవసాయ శాఖ అధికారులు, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, రవాణా కాంట్రాక్టర్, నకిలీ రైతులపై శాయంపేట పీఎస్‌లో సివిల్ సప్లయి కార్పొరేషన్ డీఎం ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ధాన్యం ప్రొక్యూర్మెంట్లో అక్రమాలకు పాల్పడినట్టు తేలితే చర్యలు తప్పవని శశిధర్‌రాజు హెచ్చరించారు. 21 మందిపై కేసు నమోదు చేసినట్టు శాయంపేట ఎస్సై పరమేశ్ తెలిపారు.