హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : రైస్ మిల్లర్ల ఒత్తిడికి పౌరసరఫరాల సంస్థ తలొగ్గిందా? ధాన్యం కేటాయింపుల్లో అవినీతికి రాచమార్గం వేసిందా? నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ‘పెద్దమనిషి’ ఆదేశాలే అధికారుల కు శిరోధార్యమా? మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ (బియ్యం) ఇవ్వడం లేదంటూ దాడులు చేసి కేసులు పెడుతున్న సివిల్ సప్లయ్ సంస్థ.. మళ్లీ అదే మిల్లులకు రెట్టింపు ధాన్యం కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేంటి? డిఫాల్ట్ మిల్లులకు గింజ ధాన్యం కేటాయించబోమన్న అధికారులు.. మళ్లీ అదే మిల్లుల్లో ధాన్యం నిలువ చేసేందుకు అనుమతివ్వడం దేనికి సంకేతం? ఇవీ సివిల్ సప్లయ్ అధికారుల తాజా నిర్ణయాలపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు. సదరు శాఖ వ్యవహారశైలి కూడా ఈ ప్రశ్నలకు బలం చేకూర్చేలా ఉన్నది. యాసంగిలో మిల్లులకు ధాన్యం కేటాయింపుల విషయంలో సివిల్ సప్లయ్ ఇటీవల రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇందులో ఒకటి మిల్లులకు మిల్లింగ్ సామర్థ్యానికి రెట్టింపు ధాన్యం కేటాయించడం కాగా, మరొకటి డిఫాల్ట్ మిల్లుల్లో ధాన్యం నిల్వ చేసేందుకు అనుమతివ్వడం. ఈ రెండు నిర్ణయాలూ అవినీతికి ఆజ్యం పోసేలా, కొంతమంది మిల్లర్ల దోపిడీకి సహకరించేలా ఉన్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మిల్లర్లు అడిగారు కాబట్టే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొనడం గమనార్హం. దీంతో మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గే ఈ నిర్ణయాలు తీసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మిల్లులకు ధాన్యం కేటాయింపుల విషయంలో సివిల్ సప్లయ్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. ఒకవైపు, సకాలంలో సీఎంఆర్ ఇవ్వడం లేదంటూ మిల్లులపై దాడులు చేస్తూ కేసులు నమోదుచేస్తున్న అధికారులు.. ఇప్పుడు అవే మిల్లులకు సామర్థ్యానికి మించి రెట్టింపు ధాన్యం కేటాయిస్తున్నారు. ఇన్నాళ్లూ గత ప్రభుత్వంపై, మిల్లర్లపై సివిల్ సప్లయ్ అధికారులు, ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.వేల కోట్ల విలువైన ధాన్యం మిల్లుల్లో ఉండిపోయిందని, మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. కానీ, ప్రస్తుత నిర్ణయాలను పరిశీలిస్తే, రైస్ మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గిన కాంగ్రెస్ సర్కారు.. వారితో కుమ్మక్కయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే మిల్లులకు రెట్టింపు ధాన్యం కేటాయింపు నిర్ణయం తీసుకున్నదనే విమర్శలొస్తున్నాయి. మిల్లింగ్ సామర్థ్యానికి సరిపడ ధాన్యం ఇస్తేనే సకాలంలో బియ్యం ఇవ్వని మిల్లర్లు.. అంతకు రెట్టింపు ధాన్యం కేటాయిస్తే ఏవిధంగా సీఎంఆర్ ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ యాసంగి సీఎంఆర్‌ను ఇచ్చేందుకు ఎఫ్‌సీఐ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చింది. అయితే, నాలుగు నెలల్లోనే కొన్ని మిల్లులు రెట్టింపు సామర్థ్యం బియ్యాన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతాయన్నది ప్రశ్న. ఒకవేళ, ఎఫ్‌సీఐ సీఎంఆర్ గడువు పొడిగిస్తుందని భావించి అధికారులు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అయితే ఎఫ్‌సీఐ గడువు పొడిగించకపోతే పరిస్థితేమిటి? దీనివల్ల కలిగే నష్టానికి బాధ్యులు ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అధికారులు మాత్రం రెట్టింపు కేటాయింపులను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. యాసంగిలో భారీగా ధాన్యం వస్తున్నదని, అకాల వర్షాల నేపథ్యంలో ఈ ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రంలోని డిఫాల్ట్ మిల్లులకు, కేసులు నమోదైన మిల్లులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయించే ప్రసక్తే లేదని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ, తాజాగా ఆయా మిల్లుల్లో ధాన్యం నిల్వ చేసేందుకు అనుమతిస్తూ సివిల్ సప్లయ్ ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ డిఫాల్ట్ మిల్లుల్లో ధాన్యం నిల్వకు స్థలం లేనిపక్షంలో ఆయా మిల్లులు డిఫాల్ట్ మిల్లులను వినియోగించుకోవచ్చని పేర్కొన్నది. అయితే ఆ ధాన్యం కేటాయింపులన్నీ నాన్ డిఫాల్ట్ మిల్లు పేరుపైనే ఉంటాయని తెలిపింది. ఇక్కడే పెద్ద గూడుపుఠాణి జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకొని జిల్లాల్లో పెద్ద ఎత్తున డిఫాల్ట్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరిగినట్టు తెలిసింది. పేరుకేమో ఆ ధాన్యం నాన్ డిఫాల్ట్ మిల్లర్‌ది.. వాడుకునేది మాత్రం డిఫాల్ట్ మిల్లర్లేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పలు జిల్లాల్లో పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సివిల్ సప్లయ్ తీసుకున్న ఈ నిర్ణయం అవినీతికి ఆస్కారం ఇచ్చేలా ఉన్నదనే విమర్శలొస్తున్నాయి.
సివిల్ సప్లయ్ తాజా నిర్ణయాల వెనుక ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చక్రం తిప్పినట్టు ఇటు మిల్లింగ్ ఇండస్ట్రీ, అటు సివిల్ సప్లయ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇందులో ఒకరు బడా మిల్లర్ కాగా, మరొకరు కీలక పదవి కోసం పోటీ పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అని తెలిసింది. ఈ ఇద్దరూ కలిసి సివిల్ సప్లయ్‌ని శాసిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏది అడిగినా కాదనకుండా అధికారులంతా ‘జీ హుజూర్’ అంటున్నట్టు తెలిసింది.