హైదరాబాద్, జూన్ 26(నమస్తే తెలంగాణ) : ధాన్యం టెండర్ల వ్యవహారం సివిల్ సప్లయ్‌కు మాయని ‘మచ్చ’గా మారింది. అధికారులు, బిడ్డర్లు, మధ్యవర్తులు కలిసి కోట్లు కొల్లగొడుతూ పౌరసరఫరాలశాఖను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేసేలా ధాన్యం టెండర్లలో ఆ శాఖ భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నది. ఇప్పటికే అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ. 5 వేల కోట్ల వరకు నష్టాలొచ్చాయని ప్రాథమిక అంచనా. టెండర్ ధాన్యం పంచాయితీ ఇప్పటికీ తెగలేదు. దీంతో ఈ నష్టం మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలను సివిల్ సప్లయ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ధాన్యం టెండర్ గడువు ఎన్నిసార్లు పొడిగిస్తే బిడ్డర్లకు, మధ్యవర్తులకు అంత లాభం జరుగుతుందని, కానీ సివిల్ సప్లయ్‌కు నష్టాలనే మిగుల్చుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
38 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలంలో విక్రయించడం ద్వారా రూ. 7,600 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని సివిల్ సప్లయ్ భావించింది. అయితే టెండర్లు అప్పగించి ఏడాదిన్నర గడుస్తున్నా బిడ్డర్లు 19 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే తీసుకెళ్లారు. ఇందుకు రూ. 3,800 కోట్లు చెల్లించారు. ఇంకా రూ. 3,800 కోట్ల విలువైన 19 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే మూలుగుతున్నది. 90 రోజుల్లో మొత్తం ధాన్యం తీసుకెళ్లి డబ్బులు చెల్లించాల్సిన బిడ్డర్లు 480 రోజులైనా పూర్తిగా ఎత్తలేదు. మూడోసారి పొడిగించిన గడువు సైతం ఈ నెల 11వ తేదీతో ముగిసింది. దీంతో ఇప్పుడు మిగిలిన 19 లక్షల టన్నుల ధాన్యం, రూ. 3,800 కోట్ల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో టెండరు గడువు మరోమారు పొడిగిస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతున్నది. ఒకవేళ టెండర్లు రద్దుచేస్తే మిగిలిన ధాన్యాన్ని ఏం చేయాలి? మిగిలిన డబ్బును ఎలా రాబట్టుకోవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అధికారులు, నేతలు, మధ్యవర్తులు, బిడ్డర్ల కమీషన్ల కక్కుర్తి సివిల్ సప్లయ్‌కి పెను శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బిడ్డర్లు, మధ్యవర్తులు ధాన్యం ఎత్తకుండా మిల్లర్లపై ఒత్తిడి పెంచి ధాన్యానికి సమాన విలువతో పాటు కమీషన్ కింద క్వింటాలుకు రూ. 230 వరకు అదనంగా వసూలు చేయడం ఈ పరిస్థితికి దారితీసిందనే ఆరోపణలున్నాయి. మధ్యవర్తులతో అధికారులు కుమ్మక్కు కాకుండా నిక్కచ్చిగా వ్యవహరించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని చెప్తున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ వ్యక్తి సివిల్ సప్లయ్‌కు, ప్రభుత్వానికి ‘మచ్చ’ తెచ్చారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే సివిల్ సప్లయ్ నష్టాల్లో కూరుకుపోయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సకాలంలో ధాన్యం ఎత్తని బిడ్డర్లపై అధికారులు, ప్రభుత్వం ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం లేదు.
బిడ్డర్లు ఎత్తాల్సిన రూ.3800 కోట్ల విలువైన 19 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే ఉండిపోయింది. అంటే ఇప్పట్లో రూ. 3,800 కోట్లు సివిల్ సప్లయ్‌కు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడొస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు గానూ రెండేళ్ల క్రితం 12 శాతం వడ్డీతో బ్యాంకుల నుంచి పౌరసరఫరాల శాఖ రూ. 7,600 కోట్లు అప్పు తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రతి నెల సుమారు రూ. 75 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నది. బిడ్డర్లు సకాలంలో ధాన్యం ఎత్తకపోవడంతో 16 నెలలుగా ఈ వడ్డీ భారం సివిల్ సప్లయ్ పైనే పడుతున్నది. తద్వారా మిల్లర్లు ఎత్తిన ధాన్యం, చెల్లించిన డబ్బులను మినహాయిస్తే కనీసం రూ. 1000 కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్టు తెలిసింది. మరోవైపు, మిగతా ధాన్యం పరిస్థితి తేలే వరకు రూ. 3,800 కోట్లు, ఇప్పటికే చెల్లించిన రూ. 1000 కోట్ల వడ్డీ కలిపి రూ. 4,800 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. బిడ్డర్లు చేసిన పాపం ఇలా సివిల్ సప్లయ్ మెడకు చుట్టుకోవడంతో అది అప్పుల ఊబిలో దిగబడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.