హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.400 కోట్ల ప్రభుత్వ సొమ్ముకు పురుగులు పడుతున్నాయి. డబ్బులకు పురుగులు పట్టడం ఏమిటని అనుకుంటున్నారా? నిజమే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులు, గోదాముల్లో దొడ్డు బియ్యం రూపంలో ఉన్న రూ.400 కోట్లకు పురుగులు పడుతున్నాయి. పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళిక లోపం కారణంగా ప్రజల సొమ్ము పురుగులపాలవుతున్నది. ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
అప్పటికే రేషన్‌షాపులు, గోదాముల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం సంగతిని గాలికొదిలేసింది. దీంతో మూడునాలుగు నెలలుగా ఆ బియ్యం గోదాములు, రేషన్ షాపుల్లోనే ముక్కిపోతున్నాయి. పురుగులు పట్టి పాడైపోతున్నాయి. అయినా ఇప్పటికీ ప్రభుత్వంగానీ, పౌరసరఫరాల శాఖ అధికారులుగానీ దొడ్డు బియ్యాన్ని ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేదు. తమ శాఖ అప్పుల్లో ఉన్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదేపదే చెప్తున్నారు. కానీ రూ.400 కోట్లకు పైగా నష్టం కలుగుతున్నా కిక్కురుమనడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పం పిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ విషయం అధికారులకు ముందే తెలుసు. కాబట్టి దొడ్డు బియ్యం నిల్వలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ అధికారులు దిశగా కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో, గోదాముల్లో సుమారు లక్ష టన్నుల దొడ్డు నిల్వలు పేరుకుపోయాయి. స్థలం కొరత, సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడం, వర్షాలకు తడవడం వంటి కారణాలతో బియ్యం పురుగులు పడుతున్నాయి. రంగుమారి పాడైపోతున్నాయి. సీఎంఆర్ రూ పంలో ఎఫ్‌సీఐకి మనం బియ్యం ఇస్తే కిలోకు రూ.40-42 వరకు చెల్లిస్తున్నది. అంటే టన్నుకు రూ.40-42వేల మధ్య ధర ఉన్నది. ఈ లెక్కన లక్ష టన్నుల దొడ్డు బియ్యం విలువ రూ. 400-420 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పౌరసరఫరాల సంస్థ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వందల కోట్ల విలువైన బియ్యం పురుగులకు నైవేద్యమైందని విమర్శిస్తున్నారు.
దొడ్డు బియ్యం నిల్వలతో రేషన్‌డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత బస్తాలు పేరుకుపోవడంతో సన్నబియ్యం నిల్వ చేయడానికి కష్టం అవుతున్నదని చెప్తున్నారు. దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు ప్రస్తుతం ఇస్తున్న సన్నబియ్యానికి కూడా పాకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దొడ్డు బియ్యం తీసుకెళ్లాలంటూ డీలర్లు మొర పెట్టుకుంటున్నారు. జిల్లాల్లో కలెక్టర్లకు పలుమార్లు లేఖలు రాశారు. అయినా అధికారుల నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఆ దొడ్డు బియ్యాన్ని ఏం చే ద్దామనే అంశంపై అటు మంత్రిస్థాయిలోగానీ, ఇటు అధికారుల్లోగానీ చర్చించలేదని తెలిసింది. ప్రభుత్వం ముం దుగా మేల్కొని మిగిలిపొయిన దొడ్డు బియ్యాన్ని టెండర్ ద్వారా విక్రయిస్తే ఖజానాకు డబ్బు వచ్చేదని, నష్టం తగ్గేదని నిపుణులు అభిప్రాయపడుతున్నా రు. ఇప్పుడు బియ్యానికి పురుగులు పట్టాయనే సాకుతో తాము ఎంపిక చేసినవారికి అడ్డికి పావుసేరుకే విక్రయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం కిలో రూ.42 ఉండగా, దానిని తగ్గించి రూ.10-15కి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.