హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలువురు బ్యూరోక్రాట్లు తమ హోదా, పరిధి మరిచిపోయి అధికార పార్టీ సేవల్లో తరిస్తున్నారా? అఖిల భారత సర్వీస్ అధికారులు కాస్తా.. అఖిల భారత కాంగ్రెస్ సేవల అధికారులుగా మారిపోయారా?, రోజూ బాస్, బిగ్ బ్రదర్స్ సేవల్లో తరిస్తున్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తున్నది. పార్టీ నేతలను మించి కాంగ్రెస్ ‘ఎజెండా’ మోస్తున్నారని, ఇష్టారాజ్యంగా మాట్లాతున్నారన్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. బహిరంగ సభల్లో వేదికలు ఎక్కితే నీళ్లు తాగినంత సులువుగా అబద్ధాలు చెప్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ కండువా వేసుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టు వ్యవహరించారని విమర్శలు వినిపించాయి. రాజకీయ నేత తరహాలో మాట్లాడి ఐపీఎస్‌ల పరువు తీశారని ఆరోపిస్తున్నారు. ఖైరతాబాద్‌లో జరిగిన రేషన్‌కార్డు పంపిణీ సభలో ఆయన మాట్లాడుతూ ‘మీరు ఆలోచించండి. 10 సంవత్సరాల్లో జరగని ప్రక్రియ. ఎంతో మంది జనాలు మీసేవల్లో ట్రై చేసినా, అక్కడా ఇక్కడా యత్నించినా ఎవరికీ రేషన్‌కార్డులు రాలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం క్యాబినెట్ ఆధ్వర్యంలో చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అంటూ డీఎస్ చౌహాన్ వచ్చీరాని తెలుగుభాషలో మాట్లాడిన తీరు వేదిక మీద కూర్చున్న కాంగ్రెస్ నేతలను సైతం అశ్యర్యానికి గురిచేసింది.
వాస్తవానికి 2016 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 6.48 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చింది. అయినా ఏమీ ఇవ్వలేదని రాజకీయ నేతలు విమర్శలు చేయడం సాధారణమే. కానీ డీఎస్ చౌహాన్ తానొక పబ్లిక్ సర్వెంట్ అనే విషయం మరిచిపోయి, వాస్తవసమాచారం దాచిపెట్టి, పదేండ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రకటించటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదంతా తెర మీద జరిగిన తంతు అని, తెర వెనుక ఆయన వ్యవహారం మరోరకంగా ఉంటుందని పౌరసరఫరాలశాఖ వర్గాలు చెప్తున్నాయి.
ముఖ్యనేత ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఆ శాఖలోకి పంపినట్టు చర్చ జరుగుతున్నది. ఇటీవలే రూ.1100 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, సూత్రధారులు, పాత్రధారులపై శోధిస్తున్నట్టు ప్రచారం జరుగుతన్నది. ఆ గుట్టు బయటపడితే, ముఖ్యనేతకు రాజకీయంగా ఎదురులేకుండా పోతుందనే రహస్య మంత్రాంగం నడిపిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
సిరిసిల్ల కలెక్టర్ సంజయ్ కుమార్ ఝా బీఆర్ఎస్ జెండా చూసినా, కేటీఆర్ బొమ్మ చూసినా శివాలెత్తిపోతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ సమీపంలో బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి కేటీఆర్ మీద అభిమానంతో తన టీ స్టాల్‌పై ఆయన ఫొటో పెట్టుకున్నారు. ఇది చూసిన ఝాకు ఏమనిపించిందో? ఏమో? వెంటనే టీ స్టాల్ మూసి వేయించండి అంటూ మున్సిపల్‌శాఖకు ఆదేశాలిచ్చి, తొలిగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిరిసిల్లలో ముఖ్యనేతకు షాడోగా పనిచేస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు సంజయ్, వివేకానంద అప్పట్లో సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఓ కేసులో ఆయన దురుసు ప్రవర్తనతో కోర్టుకు క్షమాపణ చెప్పినట్టు ప్రజలు చెప్తున్నారు.
దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన మహిళా బ్యూరోక్రాట్ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్. ‘మహబూబ్‌నగర్‌లో వర్షంలో కురిస్తే హైదరాబాద్ సెక్రటేరియట్లో ముఖ్యనేతకు గొడుగు పడుతున్నట్టు’ ఆమె ప్రవర్తిస్తున్నదని చెప్పుకుంటున్నారు. అదేంటి అని అడిగితే ‘మా ప్రాంతం నుంచి కాకకాక ఒక్కరు ముఖ్యనేత అయ్యారు. రక్షించుకోవద్దా?’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారట.
రాష్ట్రంలోని ఓ కీలక మంత్రి కార్యదర్శిపై భారీగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ శాఖలోని సామాన్య దిగువ శ్రేణి కాంట్రాక్టర్ల బిల్లులను కడకంట కూడా చూడటం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీఎంవో నుంచి ఆయన ద్వారా ప్రతి రూపాయిని మానిటరింగ్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.కోటి వ్యవహారం కూడా ముఖ్యనేత కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సదరు మంత్రి సిఫారసు చేసిన బిల్లుల చెల్లింపు, ఇతర లావాదేవీలను కూడా ముఖ్యనేత సన్నిహితుని దృష్టికి తీసుకువెళ్లి, ఆయన చేయమంటేనే చేస్తున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ప్రతి నెలా చేస్తున్న రూ.5 కోట్ల కాంట్రాక్టు పెండింగ్ బిల్లుల వ్యవహారం కూడా ముఖ్యనేత సన్నిహితుడు చెప్పిన తర్వాతే క్లియర్ అవుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఆయన వ్యవహారంతో మంత్రితోపాటు, చిన్నచిన్న కాంట్రాక్టర్లు, గ్రామ అభివృద్ధి పనులు చేసుకున్న మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. వీరే కాకుండా ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లు కూడా పట్టపగ్గాలు లేకుండా వ్యవరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ఈవెంట్ వివాదాస్పదంగా మారడానికి సీనియర్ ఐఏఎస్ అధికారి కారణం అనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యనేత అడుగులకు మడుగులు ఒత్తుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. మరో ఐఏఎస్ అధికారి ఏకంగా ఓ మంత్రి ఇంటి గుమస్తాగా మారిపోయాడని ప్రచారం జరుగుతున్నది.