జిన్నారం, ఏప్రిల్ 29: సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి టీఐడీసీ పరిశ్రమలో శనివారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో సీఐటీయూ విజయం సాధించింది. బీఎంఎస్ నుంచి పోటీ చేసిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు గెలుపొందారు. టీఐడీసీ పరిశ్రమలో మొత్తం 173 ఓట్లు ఉండగా చుక్క రాములుకు 87 ఓట్లు, రఘునందర్‌రావుకు 84 ఓట్లు వచ్చాయి. 3 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.
టీఐడీసీ యూనియన్ ఎన్నికల్లో చుక్క రాములు వరుసగా నాలుగోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా పరిశ్రమ వద్ద సీఐటీయూ నాయకులు విజయోత్సవాలు నిర్వహించారు. చుక్క రాములు మాట్లాడుతూ.. కార్మికులకు సీఐటీయూతోనే న్యాయం జరుగుతుందని చెప్పారు. సీఐటీయూను గెలిపించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు.