హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): తాను పత్తి రైతు సమస్యలపై ముంబై వెళ్లిన సమయం చూసి, తన శాఖ పరిధిలోని సినీ కార్మికుల అభినందన సభ పెట్టడం తనను దారుణంగా అవమానించడమేనని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. సినీ పరిశ్రమపై షాడో పెత్తనం ఏమిటని, పరిశ్రమను మొత్తం ఆయనే నడిపిస్తున్నట్టు కలరింగు ఇస్తున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను లేని సమయం చూసి అంత అర్జెంటుగా సినీ కార్మికుల అభినందన సభ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని బాధపడినట్టు తెలిసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను కలిసి పత్తి కొనుగోళ్ల మీద చర్చించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముంబై వెళ్లారు. ఆయన వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా ఉన్నారు. ఇటీవల సీని కార్మికులు వేతనాల పెంపు కోసం ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
కార్మికుల ఆందోళనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కోమటిరెడ్డి మద్దతు ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే నిర్మాతల సంఘం నుంచి షాడో మంత్రి రంగ ప్రవేశం చేసి కార్మిక డిమాండ్లకు అడ్డం పడ్డట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. మంగళవారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో సినీ కార్మికుల అభినందన సభ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేకుండానే జరిగిందని, ఆయన స్థానాన్ని సీఎం షాడో మంత్రితో భర్తీ చేశారని కార్మిక వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కార్మిక నాయకుడిగా, సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్మికులకు న్యాయం చేయాలని తపన పడ్డారని, కానీ నిర్మాతల కోసమే ఉన్న షాడో మంత్రి తనను సాగనీయడం లేదని మంత్రి మథనపడ్డట్టు తెలిసింది. తాను ముంబై వెళ్లడం మందుగానే నిర్ణయించిన ప్రణాళిక అని, తాను లేని సమయం చూసి సినీ కార్మిక సభ పెట్టడం, తన ప్రయేయం లేకుండానే వరాలు కురిపించడం సినీ కార్మికుల నుంచి తనను దూరం చేసే ప్రయత్నమేనని తన సన్నిహితులతో చెప్పి బాధపడినట్టు తెలిసింది. తాను, తన సోదరుడు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వాళ్లమ ని, కానీ తమ కుటుంబంలో మంటలు రేపి తన నోరు మూయిస్తున్నారని కోమటిరెడ్డి బాధపడ్డట్టు తెలిసింది.