హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2014 నుంచి 2026 వరకు మైనింగ్ అక్రమాలపై విచారణ చేపట్టనున్నట్టు సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపారు. సోమవారం ప్రెస్‌మీట్ అనంతరం ఆమె మీడియాతో ముచ్చటించారు. మైనింగ్ అక్రమాలపై విచారణ చేయిస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం, తర్వాత విజిలెన్స్ అధికారులు పలుచోట్ల తనిఖీలు చేపట్టి ఆ నివేదికను సీఐడీకి అందించిన విషయమై పలువురు జర్నలిస్టులు ప్రశ్నించారు. స్పందించిన చారుసిన్హా విజిలెన్స్ నుంచి తమకు నివేదిక అందిందని స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రంలోని మైనింగ్ అక్రమాలపై ‘ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ ఎంక్వైరీ’ కొనసాగనుందని వెల్లడించారు. విజిలెన్స్ తరహాలోనే ఈ అంశాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. తమ విచారణలో ఎక్కడైనా అక్రమాలు జరిగాయని తెలిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలనుబట్టి అవసరమైతే ఆరుగురు అధికారులతో స్పెషల్ సిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సీఐడీకి విజిలెన్స్ విభాగం అందించిన నివేదిక ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతుందని తెలిసింది. కరీంనగర్, పెద్దపల్లి, గంగాధర, రాఘవాపురం, ఉప్పల్, జగిత్యాల ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ నిర్వహించినట్టు ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. డిమాండ్ నోటీసులు ఇచ్చినా రూ.కోట్ల రాయల్టీ చెల్లించనివి, ఎకువ రవాణా చేసి తకువగా చూపినవి, లీజు ప్రాంతాన్ని దాటి అక్రమమైనింగ్, తప్పుడు రవాణా పత్రాలు, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టిన సంస్థలు.. వంటి అంశాలను ఆధారంగా తీసుకొని విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. 2024-25, 2025-26లో ఓఆర్ఆర్ పరిధిలో మైనింగ్, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంయుక్తంగా పరిశీలించి అక్రమంగా నడుస్తున్న 20కిపైగా యూనిట్లను ధ్వంసం చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు.
కాగా, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ వ్యవహారం గత అసెంబ్లీ సమావేశాల్లో కలకలం రేపగా.. మైనింగ్ అక్రమాలపై విచారణ చేపట్టాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఓఆర్ఆర్ చుట్టుపకల అక్రమ క్రషర్ యూనిట్లతోపాటు 6 గ్రానైట్ కంపెనీలు, నేరెళ్ల సాండ్ మైనింగ్ కేసును సీఐడీకి అప్పగించాలని మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది.