మహబూబ్‌నగర్/హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ వరద భాస్కర్ ముదిరాజ్‌పై పోలీసులు జులుం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం పీఎస్‌ను ముట్టడించారు. అక్కడ బైఠాయించి భాస్కర్‌ను చితకబాదిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తె లుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే శ్రీనివాస్‌గౌడ్‌కు ఫోన్ చేయగా.. ఆయన మహబూబ్‌నగర్ టౌన్ పోలీసుల దౌ ర్జన్యాన్ని వివరించారు. ‘పోలీసుల వేధింపులు, బెదిరింపులకు భయపడొద్దు. మీకు మేము న్నాం’ అంటూ ధైర్యం చెప్పారు. ఫోన్లో బాధితుడిని పరామర్శించిన కేటీఆర్.. సీఐపై చట్టప్రకారం ముందుకు వెళ్తామని, ఉన్నతాధికారుల తో మాట్లాడుతానని భరోసా ఇచ్చారు. దీంతో దిగొచ్చిన సీఐ.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన విరమించారు.
సోషల్ మీడియాలో ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను ప్రశ్నిస్తూ పోస్టుపెట్టిన మహబూబ్‌నగర్‌కు చెందిన గులాబీ పార్టీ కార్యకర్త భాస్కర్‌ను పీఎస్‌కి పిలిపించి సీఐ అప్పయ్య చితకబాదారు. దీంతో భాస్కర్‌ను పరామర్శించడానికి శ్రీనివాస్‌గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, ఆంజనేయగౌడ్, నేత లు బాధితుడి ఇంటికి వెళ్లారు. సీఐ చితకబాదిన గాయాలను వారికి చూపించాడు. దీంతో ఆగ్రహించిన నాయకులు.. భాస్కర్ ఇంటి నుంచి ర్యాలీగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని అక్కడ బైఠాయించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సామాజిక మా ధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టినందుకు దుర్భాషలాడటంతోపాటు చితకబాదడం ఏమిటని సీఐని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు సీఐపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. దీంతో దిగొచ్చిన సీఐ అప్పయ్య మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.