మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 25 : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రీస్తు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చర్చిలో శిలువ ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలి ఆరాధన దైవంలో సినాడ్ మాడరేటర్, బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేశారు. యేసు ప్రభువు విశ్వానికి మార్గం చూపే లోక రక్షకుడని, యేసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా డయాసిస్ సభ్యులు, చర్చి కమిటీ సభ్యులతో కలిసి బిషప్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం రెండో ఆరాధన దైవం ఉదయం 10 గంటలకు చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య ఆధ్వర్యంలో కొనసాగింది. భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని పాస్టర్ల ఆశీర్వాదం తీసుకున్నారు.
గురువారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మెదక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గ్గొని కేక్ కట్ చేశారు.