ముక్కలుగా కోసి.. గోనె సంచిలో కుక్కి.. బీఆర్ఎస్ నేత పాశవిక హత్య
సూర్యాపేట జిల్లాలోని యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును ప్రత్యర్థులు పాశవికంగా హత్యచేశారు. శుక్రవారం రాత్రి ఆయనను సూర్యాపేట పట్టణంలో ముక్కలుగా నరికి దారుణంగా హత్యచేశారు. అనంతరం ఆ ముక్కలను గోనె సంచిలో కుక్కి యల్కారం శివారులోని ఎస్సారెస్పీ కాలువలో పడేశారు.
- సూర్యాపేట జిల్లా యల్కారంలో మరో దారుణం
- పాతకక్షలతో మాజీ సర్పంచ్ భర్తపై ఘాతుక చర్య
- ఓ దావత్లో ఉండగానే నరికి చంపిన ప్రత్యర్థులు
- సంచిలో కుక్కి ఎస్సారెస్పీ కాల్వలో పడేసిన దుండగులు
- మధును కాంగ్రెస్ గూండాలే హత్యచేశారు:జగదీశ్‌రెడ్డి
- యల్కారంలో పోలీస్ పికెట్ ఏర్పాటు
సూర్యాపేటటౌన్, మే 23: సూర్యాపేట జిల్లాలోని యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును ప్రత్యర్థులు పాశవికంగా హత్యచేశారు. శుక్రవారం రాత్రి ఆయనను సూర్యాపేట పట్టణంలో ముక్కలుగా నరికి దారుణంగా హత్యచేశారు. అనంతరం ఆ ముక్కలను గోనె సంచిలో కుక్కి యల్కారం శివారులోని ఎస్సారెస్పీ కాలువలో పడేశారు. పట్టణంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో ఒకరి ఇంట్లో దావత్లో మద్యం తాగుతుండగా, ప్రత్యర్థులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
శుక్రవారం సూర్యాపేటలోని తన నివాసం నుంచి బయటకు వెళ్లిన మధు సాయంత్రం నుంచి ఫోన్లో అందుబాటులోకి రాలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత యల్కారం గ్రామ శివారులోని ఓ పిల్ల కాలువలో అనుమానాస్పదంగా ఓ మూట కనిపించిందని సమాచారం అందుకున్న పోలీసులు అది మధు మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు.

పేటలో హత్య.. గోనె సంచిలో కుక్కి
సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన తాటిపాముల జానయ్య అనే వ్యక్తి ఇంట్లోనే మధు హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. అక్కడ మద్యం సిట్టింగ్ ఆనవాళ్లను గుర్తించారు. అక్కడే మధును హతమార్చి అనంతరం మృతదేహాన్ని వాహనంలో యల్కారం గ్రామ శివారులోకి తరలించినట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలంలోని ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. మధు 25 ఏండ్ల క్రితం జరిగిన మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్యకేసులో నిందితుడు. పాతకక్షల నేపథ్యంలోనే రవీందర్ వర్గీయులు మధును హత్యచేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యల్కారం ఫ్యాక్షన్పరంగా సున్నితమైన గ్రామం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు.
యల్కారంలో 8మంది బలి
యల్కారం గ్రామంలో 1985 నుంచి రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. ఈ కక్షల కారణంగా ఇప్పటివరకు 8మంది ప్రాణాలు కోల్పోయారు. 1985లో ఆ గ్రామ టీడీపీ నాయకుడు యలగందుల సిద్ధయ్య సూర్యాపేటలో దారుణహత్యకు గురయ్యారు. అప్పటి నుంచి తాజాగా జరిగిన మధు హత్య వరకు 8 మంది రాజకీయ కక్షలకు బలయ్యారు. 1985లో సిద్ధయ్య, ఆ తర్వాత కాంగ్రెస్ నేత పల్లె ఈదయ్య, 1996లో సిద్ధయ్య కుమారుడు అజయ్ హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి గ్రామం నివురుగప్పిన నిప్పులా ఉన్నది. అజయ్ హత్య జరిగిన కొద్దిరోజులకే అప్పటి గ్రామ సర్పంచ్ మిద్దె రవీందర్‌పై హత్యాయత్నం జరిగింది.
ఆ ఘటనకు చింతలపాటి చిన్న రమేశ్ కారణమని భావించి 1999లో ఆయనను ప్రత్యర్థులు హత్యచేశారు. ఆ తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉన్న గ్రామంలో తిరిగి 2007లో మిద్దె రవీందర్ హత్య జరిగిది. ఈ హత్యతో పోలీసులు గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసుల చర్యలు ఫలితాలు ఇవ్వడంతో కొద్దిరోజుల పాటు గ్రామం ప్రశాంతంగానే ఉన్నది. 2020లో మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను గ్రామంలో దారుణంగా హత్యచేశారు. వెంకన్న ప్రత్యర్థి వడ్లె యల్లయ్యను జగ్గయ్యపేట సమీపంలో 2024లో ఆయన ప్రత్యర్థి శ్రీకాంతాచారి హత్యచేశాడు.
చింతలపాటి మధు 25 ఏండ్ల క్రితం జరిగిన మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో నిందితుడు. తాజాగా ఈ హత్యను రవీందర్ వర్గీయులు చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ కక్షల వల్ల నలిగిపోతున్న పలు కుటుంబాలు గ్రామం వీడి వలస వెళ్తున్నాయి. పోలీసులు ఇకనైనా గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తులో ఎలాంటి రక్తపాతం జరుగకుండా శాంతిభద్రతలు నెలకొనేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
హంతకుల కోసం గాలింపు: ఎస్పీ నర్సింహ
సూర్యాపేటటౌన్, మే 23: చింతలపాటి మధు హంతకులను పట్టుకొనేందుకు 5 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ కే నర్సింహ తెలిపారు. ఈ కేసును సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో సీఐ దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానలోని మార్చురీకి తరలించిన అనంతరం అతని బంధువులతో ఎస్పీ మాట్లాడారు. హంతకులను త్వరగా పట్టుకుంటామని, కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేసి నిందితులకు కఠినశిక్ష పడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మధును కాంగ్రెస్ గూండాలే హత్యచేశారు.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, మే 23(నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధును కాంగ్రెస్ గూండాలే హత్య చేశార ని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. శుక్రవారం రాత్రి హత్యకు గురైన చింతలపాటి మధు మృతదేహం వద్ద శనివారం జగదీశ్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మధు హత్యలో పోలీసుల భాగస్వా మ్యం ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని పేర్కొన్నారు. గతంలోనూ కాం గ్రెస్ గూండాలు తమ పార్టీ సర్పంచ్ ఒంటె ద్దు వెంకన్నను దారుణంగా హత్య చేశారని చెప్పారు.
‘నువ్వు ఎగిరిపోతావు’ అని మధుకు స్వయంగా చెప్పిన ఎస్సైకి అదే మధును కాపాడే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. మధును నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా హత్యచేశారని, ఈ హత్యకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులే బాధ్యుల ని స్పష్టంచేశారు. కేసు విషయంలో పోలీసులు కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తే తర్వాతైనా ఆ కేసులను తిరగతోడతామని హెచ్చరించారు. మధు కుటుంబానికి అండ గా ఉంటామని, అతని ఇద్దరు ఆడపిల్లల చదువు, కుటుంబపోషణ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట రాజ్యసభ మాజీ సభ్యుడు లింగయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

