Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటుచేసిన స్క్రీనింగ్ కమిటీ.. నాన్చుడు కమిటీగా మారిందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ రెండుసార్లు సమావేం అయినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం.
హైదారబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో బుధవారం కూడా సమావేశం అయిన కమిటీ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఎటూ తేల్చకుండానే సమావేశాన్ని ముగించింది. మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఈసారి మకాం ఢిల్లీకి మారే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పట్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని పార్టీ నేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
ఈ నెలాఖరు వరకు వేచి చూసే ధోరణిలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్టు తెలిసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, దేశం పేరు మార్పు వంటి అంశాలతో అభ్యర్థుల ఎంపికను కొద్దికాలం వాయిదా వేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ పరిణామాలపై ఆయా నియోజక వర్గాల్లో టికెట్లు ఆశిస్తున్నారు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికను ఇంకెంత కాలం నాన్చుతారని ప్రశ్నిస్తున్నారు.