మక్తల్, మే 28: జేబులు నింపుకోవడానికే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పను లు చేపడుతున్నారని, ఇదంతా కమీషన్లకు కక్కుర్తిపడి.. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ సమీపంలో జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం ఆయ న మాట్లాడారు.
భూత్పూర్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే హైలెవల్ కెనాల్ వద్ద ఇదివరకే ఉన్న రెండు రెగ్యులేటర్ల పరిధిని పెంచాల్సి ఉండగా.. మంత్రి శ్రీహరికి ఏమాత్రం అవగాహన లేకుండా రోడ్డును అడ్డగోలుగా తవ్వుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో భూత్పూర్ పరిధిలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తే, కొడంగల్ ఎత్తిపోతలకు నీటిని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ పథకానికి నీళ్లు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పనులు ప్రారంభించి కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. భూత్పూర్ రిజర్వాయర్ 1.31 సామర్థ్యం టీఎంసీలు కలిగిన ప్రాజెక్టు నుంచి కొడంగల్ లిఫ్ట్‌నకు 7టీఎంసీలు ఎకడి నుంచి తీసుకెళ్తారో? సీఎం అర్థం చేసుకోవాలని కోరారు.