నకిరేకల్, ఏప్రిల్ 8 : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అక్కెనపల్లి రైతులకు బేషరుతగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అతని అనుచరులు రైతులను విచక్షణా రహితంగా కొట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఖండిస్తూ బుధవారం నకిరేకల్ పట్టణకేంద్రంలో మీడియాతో మాట్లాడారు.
100 మంది రైతులు అక్కెనపల్లి మార్కెట్ నుంచి ధాన్యం మిల్లులకు తీసుకెళ్తే కటింగ్ ఎక్కువ చేస్తున్నారని, క్వింటాకు 6 నుంచి 7 కేజీలు తరుగు తీస్తున్నారని, సన్నపోసల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయడంలేదని రైతులు ఎమ్మెల్యే వేముల వీరేశంకు విన్నవించుకోగా ఆయన వారిని చెంపలమీద కొట్టినట్టు తెలిపారు. మరో రైతు వీడియో తీస్తున్నాడని ఎమ్మెల్యే అనుచరుడు ఫోన్‌ను నేలకేసి కొట్టాడని, ఎమ్మెల్యేకే ఎదురు తిరుగుతరా అని రైతు కాలర్ పట్టుకుని చెంపల మీద కొట్టడాన్ని మరో రైతు వీడియో తీస్తుండగా చిట్యాలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు వీడియో తీసిన వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతుల బాధ ఎవరికి చెప్పుకోవాలి? అని ప్రశ్నించారు. గతంలో కోఆపరేటివ్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసేవారని, ఇక్కడ ఎమ్మెల్యే వీరేశం అనుచర వర్గం మాత్రమే సెంటర్ ఇన్చార్జులుగా ఉన్నారని చెప్పారు. సదరు రైతులు ఫిర్యాదు చేద్దామని పోలీస్ స్టేషన్‌కు వస్తే ఎస్సై బెదిరిస్తున్నాడని ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశంపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.