న్యూఢిల్లీ, మే 9: ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి, దిగ్గజ నటి వైజయంతి మాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉప రాష్ట్రపతి ధన్కర్, ప్రధాని మోదీతో పాటు పురస్కారాల గ్రహీతల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్, లఢక్ అధ్యాత్మిక గురువు తాంగ్డన్ రిన్పొచెయ్లకు మరణానంతరం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాలను వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతి నుంచి స్వీకరించారు. బాంబే సమాచార్ అధినేత హర్ముస్జీ ఎన్ కామా, గుజరాతీ దినపత్రిక జన్మభూమి సీఈవో కుందన్ వ్యాస్, బీజేపీ నేత ఓ రాజగోపాల్ తదితరులు పద్మ పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు.
ఇక పద్మశ్రీ అవార్డులను అందుకున్న వారిలో కేరళలోని మహిళా మావటి ప్రభాతి బారువా, తెలంగాణకు చెందిన శిల్పి వేలు ఆనందాచారి, రచయిత విఠలాచార్య, త్రిపురకు చెందిన రేఖా చక్మా, అండమాన్ నికోబార్‌కు చెందిన కే చెల్లమ్మ ఉన్నారు. చిన్నప్పుడు తన రెండు చేతులు, పాదం కోల్పోయిన కర్ణాటకకు చెందిన దివ్యాంగుడు కేఎస్ రాజన్న పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి వచ్చినప్పుడు ప్రేక్షకులు పెద్దయెత్తున చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Velu Ananda Chari