వైరా టౌన్, జనవరి 29: మిర్చికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని లాలాపురంలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బుధవారం మిర్చి పంటలను, కళ్లాలను పరిశీలించారు.
అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు మాట్లాడుతూ.. సరైన ధర లేక, భవిష్యత్తులో ధర పెరుగుతుందన్న ఆశలేక ఖమ్మం జిల్లాలోని మిర్చి రైతులు తక్కువ ధరకు పంటను విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్, మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా మిర్చికి రూ.20 వేల కనీస ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తామర పురుగు, తెగుళ్లు వంటి కారణాల వల్ల మిర్చి రైతులు ఇప్పటికే తీవ్ర నష్టపోతున్నట్టు తెలిపారు.
కరెంట్ కోతలు నివారించి పంటలు కాపాడాలని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంభాలపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. వెంటనే కోతలను ఎత్తివేసి నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని కోరారు.
– బయ్యారం
జగిత్యాల జిల్లా సారంగాపూర్ సహకార సంఘంలోని రేచపల్లి గోదాం వద్ద రైతులు యూరియా కోసం బుధవారం
ఉదయం నుంచీ బారులు తీరారు. ఈ విషయమై సహకార సంఘ సీఈవో శివకుమార్‌ను వివరణ కోరగా రేచపల్లిలో ఒక్కో రైతుకు 3 బస్తాలు, సారంగాపూర్‌లో 5 బస్తాల చొప్పున పంపిణీ చేసినట్టు వెల్లడించారు.
– సారంగాపూర్
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని 19వ వార్డుకు చెందిన మహిళలు బుధవారం తాగునీటి కోసం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలు, బకెట్లతో ఆందోళనకు దిగారు. ఐదు నెలలుగా నీళ్లు సక్రమంగా సరఫరా కావడంలేదని, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య తీరడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
-కొల్లాపూర్ రూరల్