గుమ్మడిదల, డిసెంబర్ 28: జీవావరణాన్ని నాశనం చేస్తున్న కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులు ర్యాలీ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగులో ఆదివారం కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్లు మెంగని మంగయ్య, జయమ్మ, సభ్యులు బాలుగౌడ్, స్వేచ్ఛారెడ్డి, జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులు నిరసన ర్యాలీ చేపట్టారు. నల్లకుంట చెరువును రక్షించాలని దోమడుగు అమరవీరుల స్తూపం నుంచి బొంతపల్లి కమాన్ వరకు ర్యాలీ నిర్వహించారు. భారీ రసాయన పరిశ్రమలతో నల్లకుంట చెరువు పూర్తిగా కాలుష్యకాసారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. పీసీబీ అధికారులు, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.