హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ)/ వెల్దుర్తి: వారు వయస్సులో చిన్నపిల్లలు. కానీ పెద్దలకూ స్ఫూర్తినిచ్చే పనిచేశారు. తెలంగాణకు హరితహారంలో నాటిన మొక్కలను రక్షించుకొనే విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన తాటి సాత్విక్, సుశాంత్, శ్రీకాంత్ మిత్రబృందం మొక్కల పరిరక్షణ పట్ల ప్రదర్శిస్తున్న శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తుంది. తెలంగాణకు హరితహారం, పల్లెప్రగతిలో భాగంగా ఇటీవల వెల్దుర్తిలో మొక్కలునాటారు. కొద్దిరోజులుగా వానలు కురవకపోవడం, ఎండ వేడిమి ఎక్కువగా ఉండటంతో మొక్కలకు నీళ్లు పోసే బాధ్యతను ఈ చిన్నారులు భుజానికెత్తుకున్నారు. తమ బస్తీ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి, సైకిల్‌పై నీళ్లు తెచ్చి మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. సైకిల్‌కు డబ్బా కట్టి, దానికి పైపు బిగించి, నీళ్లు పోస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నది. తమ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోవద్దనే ఉద్దేశంతోనే తామీ పనిచేస్తున్నట్టు చెప్తున్నారీ చిన్నారులు. మొక్కల పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్న చిన్నారులను పలువురు అభినందిస్తున్నారు. పంచాయతీ ఈవో బలరాంరెడ్డి గురువారం చిన్నారులను పంచాయతీ కార్యాలయానికి పిలిపించి శాలువాతో సత్కరించారు. చిన్నారులు మొక్కలకు నీళ్లు పెడుతున్న ఫొటోలు, వీడియోలను వెల్దుర్తి పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
వెల్దుర్తిలో హరితహారం మొక్కల పరిరక్షణకు చిన్నారులు ప్రదర్శించిన తపనను ఎంపీ సంతోష్‌కుమార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. అద్భుతమైన పనిచేశారు. మొక్కలకు నీరు అందించాలన్న వారి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తునదని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత సాధించడం ద్వారా మెరుగైన భవిష్యత్తు కోసం యువతరం ముందుకురావాలని ఆకాంక్షించారు.
Gives me immense pleasure to see these little hearts from Veldurthi(V) of Medak, taking care of the saplings. Look at their enthusiasm and love for the plants. It is very much required for today’s generation for their better future with sustainable environment. LoveYou boys. 👌😊 pic.twitter.com/xEwshTvVjK
— Santosh Kumar J (@MPsantoshtrs) August 5, 2021