కోటపల్లి, జూలై 4 : రెక్కాడితేగాని.. డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఆ బాలుడికి అరుదైన వ్యాధి సోకింది. రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇస్తే బతికించవచ్చని వైద్యులు తెలుపగా, అతడి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లికి చెందిన పడాల రవళి-సతీశ్ దంపతల కుమారుడు శ్రేయాన్కు ఏడాది వయసొచ్చినా కాళ్లు కదపకపోవడం.. బోర్లా పడకపోవడంతో అనుమానం వచ్చి హైదరాబాద్‌లోని రెయిన్బో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
అక్కడి వైదులు బాబుకు పరీక్షలు నిర్వహించి, స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ టైప్-2 అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వ్యాధి నయం కావాలంటే రెండేళ్లు వచ్చేలోగా జోల్జెన్మ్స్మా అనే ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి తెప్పించాలని, దీని ఖరీదు రూ.16 కోట్ల దాకా ఉంటుందని వైద్యులు తెలిపారు.
ఇప్పటికే వైద్యం కోసం రూ.10 లక్షల దాకా ఖర్చు చేశామని, ప్రస్తుతం వైద్యం కోసం నెలకు రూ.10 వేల నుంచి రూ. 20 వేల దాకా ఖర్చు చేస్తున్నామని, సర్కారుగాని.. దాతలుగాని ఆదుకోవాలని ఆ బాలుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఫోన్‌పే నంబర్ 8919512601కు డబ్బులు పంపి సాయమందించాలని చేతులెత్తి మొక్కుతున్నారు.