నారాయణఖేడ్, జనవరి 24 : అంగన్వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులూడటంతో చిన్నారులు గాయపడిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. రోజూ మాదిరిగానే శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు చదువుకుంటుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడి కిందపడ్డాయి. 27మంది పిల్లలు ఉండగా, ఆరుగురు చిన్నారులు హారిక, అంకిత, అవినాష్, మౌనిక, రిషిక, ప్రణయ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. వారిని నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు. కలెక్టర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి దవాఖానకు చేరుకుని పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. నారాయణఖేడ్ ఐసీడీఎస్ ఇన్చార్జి సీడీపీవో సుజాత, వెంకటాపూర్ అంగన్వాడీ టీచర్ అంబికను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.